Monkey Enters Ram Mandir :అయోధ్య రామమందిరంలో ఆసక్తికర ఘటన జరిగింది. మంగళవారం సాయంత్రం ఓ వానరం ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించింది. ఆలయ దక్షిణ ద్వారం నుంచి ఓ వానరం రామాలయ గర్భగుడిలోకి ప్రవేశించడం వల్ల అక్కడున్న భక్తులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వానరం రామయ్య ఉత్సవ విగ్రహాన్ని నేలపై తోసేస్తుందన్న భయంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పరుగెత్తుకెళ్లి కోతిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పుడు కోతి ఆలయ ఉత్తర ద్వారం వైపు వెళ్లింది. ఆ గేటు మూసి ఉండడం వల్ల తూర్పు ద్వారం గుండా వేలాది భక్తులను దాటుకుని ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా బయటకు వెళ్లిపోయింది.
కాగా, వానరం ఆలయంలో ప్రవేశించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రామ్లల్లాను చూసేందుకు హనుమంతుడే గర్భగుడిలోకి ప్రవేశించాడని భద్రతా సిబ్బంది వ్యాఖ్యానించారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేర్కొంది. వానరం ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించిన విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపింది.
మరోవైపు, అయోధ్య రామాలయ గర్భగుడిలోకి వానరం ప్రవేశించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం వివిధ కామెంట్లు పెడుతున్నారు. రామయ్య చూసేందుకు హనుమంతుడు వచ్చాడని పోస్ట్లు చేస్తున్నారు.
కాగా, ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత రోజు నుంచే అయోధ్య రామాలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మంగళవారం (జనవరి 23) ఒక్కరోజే బాల రాముడిని సుమారు 5లక్షల మంది దర్శించుకున్నారు. బుధవారం సైతం భక్తులు భారీ సంఖ్యలో క్యూలో ఉన్నారు.