Modi On Sandeshkhali :బంగాల్ రాజధాని కోల్‌కతాలో ప్రధాని నరేంద్ర మోదీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మర్యాదపూర్వకంగా కలిశారు (West Bengal CM Meeting Today). 'ఇది కేవలం ప్రోటోకాల్ భేటీనే, ఎటువంటి రాజకీయ పరమైన చర్చలు ఈ సమావేశంలో జరగలేదు' అని సమావేశం అనంతరం ఆమె మీడియా ముఖంగా స్పష్టం చేశారు.
'దీని గురించి తెలిస్తే ఆయన ఆత్మ ఘోషించేది'
మరోవైపు బంగాల్ సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన వేధింపుల గురించి సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్‌కు తెలిస్తే ఆయన ఆత్మ ఘోషించేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హుగ్లీ జిల్లా ఆరంబాగ్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన, అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సందేశ్‌ఖాలీలో సోదరీమణులకు టీఎంసీ ఏం చేసిందో దేశం మొత్తం చూసిందంటూ ప్రధాని విమర్శించారు. ఈ ఘటనపై ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు స్పందించలేదన్న ఆయన సందేశ్‌ఖాలీ నిందితుడు షాజహాన్ షేక్ తన పరిధులను దాటాడని దుయ్యబట్టారు. కానీ బీజేపీ నేతలు సందేశ్‌ఖాలీ మహిళల గౌరవం కోసం పోరాడారని వెల్లడించారు.
'బంగాల్ అభివృద్ధికి దీదీ అడ్డంకి'
'టీఎంసీ ప్రభుత్వం పేదలు, రైతులు, యువత, మహిళల సాధికారతకు అతిపెద్ద అడ్డంకిగా ఉంది. ఈ నాలుగు వర్గాలు సాధికారత సాధించనంత వరకు బంగాల్ అభివృద్ధి చెందదు. బీజేపీ ప్రభుత్వమే లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు కోటా కల్పించింది. బీజేపీ ప్రభుత్వమే నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు ఆధునిక డ్రోన్లను ఎగురవేయటంపై శిక్షణ ఇస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం గ్రామగ్రామాన మహిళా సంఘాలకు లక్షలకోట్ల సాయం అందిస్తోంది. దేశంలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేసే సంకల్పం తీసుకున్నాం' అని మోదీ తెలిపారు.