తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నమో 3.O- ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణం- చంద్రబాబు, పవన్ సహా అనేక మంది హాజరు - PM Oath Ceremony - PM OATH CEREMONY

Modi Oath Ceremony : భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు, వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. మోదీతోపాటు పలువురు ఎంపీలతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు.

modi
modi (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 9, 2024, 7:28 PM IST

Updated : Jun 9, 2024, 10:55 PM IST

Modi Oath Ceremony : సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 72 మందితో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది. వీరిలో 30 మంది క్యాబినెట్, ఐదుగురు స్వతంత్ర, 36 సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వీరితో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో అట్టహాసంగా కొనసాగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం 8వేల అతిథులతో కిక్కిరిసిపోయింది.

30 మంది కేబినెట్‌ మంత్రులు
మొత్తం 72 మందితో కేంద్ర మంత్రివర్గం కొలువుదీరగా వీరిలో 30 మంది కేబినెట్‌ మంత్రులు కాగా, మిగతావారు స్వతంత్ర, సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీతో పాటు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, ఎస్‌ జైశంకర్‌లు కూడా క్యాబినెట్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఐదేళ్ల తర్వాత తిరిగి మంత్రివర్గంలోకి వచ్చారు. మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, మాజీ సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌లు మోదీ కేబినెట్‌లోకి తొలిసారి అడుగుపెట్టారు. సీనియర్‌ నేతలు పీయూష్ గోయల్‌, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్‌, భూపేంద్ర యాదవ్‌ వంటి నేతలు మంత్రివర్గంలో తిరిగి చోటు దక్కించుకున్నారు. మొన్నటివరకు రాజ్యసభ సభ్యులుగా ఉన్న వీరు తాజా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్‌, అశ్వినీ వైష్ణవ్‌, వీరేంద్ర కుమార్‌, ప్రహ్లాద్‌ జోషి, గిరిరాజ్‌ సింగ్‌, జుయల్‌ ఓరం వంటి బీజేపీ నేతలకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మిత్రపక్షాలకు ఐదు
బీజేపీ మిత్రపక్షాలకు క్యాబినెట్‌లో చోటు లభించింది. జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి, హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్‌) అధినేత జితిన్‌ రాం మాంఝీ, జేడీయూ నేత లలన్‌ సింగ్‌, టీడీపీ నుంచి కె.రామ్మోహన్‌ నాయుడు, ఎల్‌జేపీ-ఆర్‌వీ నేత చిరాగ్‌ పాసవన్‌లు మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. ఐదు మిత్రపక్షాలకు ఒక్కో కేబినెట్‌ మంత్రి చొప్పున ప్రాధాన్యం ఇచ్చినట్లయ్యింది. వీరిలో కుమారస్వామి, మాంఝీలు మాజీ ముఖ్యమంత్రులు.

మోదీ పూర్తి జట్టు ఇదే
క్యాబినెట్‌: నరేంద్రమోదీ, రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, నిర్మలా సీతారామన్‌, ఎస్‌. జై శంకర్‌, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, సర్బానంద సోనోవాల్‌, వీరేంద్ర కుమార్‌, ప్రహ్లాద్‌ జోషి, జుయల్‌ ఓరం, గిరిరాజ్‌ సింగ్‌, అశ్వనీ వైష్ణవ్‌, జ్యోతిరాదిత్య సింథియా, భూపేంద్ర యాదవ్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌, అన్నపూర్ణాదేవి, కిరణ్‌ రిజిజు, హర్దీప్‌ సింగ్‌, మన్‌సుఖ్‌ మాండవీయ, కిషన్‌ రెడ్డి, ఇంద్రజీత్‌ సింగ్‌, జితేంద్ర సింగ్‌, అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, ప్రతాప్‌ రావ్‌ గణపత్‌ రావు జాదవ్‌, రామ్మోహన్‌ నాయుడు, జేడీఎస్‌ నేత కుమారస్వామి, జితన్‌ రాం మాంఝీ, జేడీయూ నేత లలన్‌ సింగ్‌, ఎల్జేపీ నేత చిరాగ్‌ పాసవాన్‌

సహాయ మంత్రులు: జయంత్‌ చౌదరి, జితిన్‌ ప్రసాద్‌, శ్రీపాద్‌ యశో నాయక్‌, పంకజ్‌ చౌదరి, క్రిషన్‌ పాల్‌, రాందాస్‌ అఠవలే, రామ్‌నాథ్‌ ఠాకూర్‌, నిత్యానంద్‌ రాయ్‌, అప్నాదళ్‌ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్‌, సోమన్న, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎస్పీ సింగ్‌ బఘేల్‌, శోభా కరంద్లాజే, కీర్తి వర్థన్‌ సింగ్‌, బీఎల్‌ వర్మ, శాంతను ఠాకూర్‌, సురేశ్‌ గోపి, ఎల్‌ మురుగన్‌, అజయ్‌ తంప్టా, బండి సంజయ్‌, కమలేశ్‌ పాసవాన్‌, భగీరథ్‌ చౌదరి, సతీశ్‌ చంద్ర దూబె, సంజయ్‌ సేథ్‌, రవ్‌నీత్‌ సింగ్‌, దుర్గాదాస్‌ ఉయికె, రక్షా నిఖిల్‌ ఖడ్సే, సుఖాంత్‌ మజుందార్‌, సావిత్రి ఠాకూర్‌, తోకన్‌ సాహు, రాజ్‌ భూషణ్‌ చౌధరి, భూపతి రాజు శ్రీనివాస్‌ వర్మ, హర్ష మల్హోత్రా, నిముబెన్‌ బంభానియా, మురళీధర్‌ మొహోల్‌, జార్జ్‌ కురియన్‌, పబిత్ర మార్గెరెటా

ఖర్గే మినహా విపక్ష నేతలు దూరం
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విపక్ష నేత మల్లికార్జున ఖర్గే హాజరుకాగా పలు విపక్ష పార్టీలు ఇందుకు హాజరుకాలేదు. రాజకీయ, వ్యాపార, సినీ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్‌ కుమార్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వంటి ప్రముఖులు హాజరయ్యారు.

ప్రముఖుల సందడి
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వ్యాపార, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, షారుక్‌ ఖాన్‌, రజనీకాంత్‌, అక్షయ్‌ కుమార్‌, రవీనా టండన్‌, అనుపమ్‌ ఖేర్‌, విక్రాంత్‌ మస్సే వంటి ప్రముఖులు విచ్చేశారు. వీరితోపాటు అంబానీ కుమారులు అనంత్‌, ఆకాశ్‌, అల్లుడు ఆనంద్‌ పిరమల్‌ రాగా గౌతమ్‌ అదానీ సతీమణి ప్రీతి, సోదరుడు రాజేశ్‌ అదానీలు హాజరయ్యారు.

విదేశీ అతిథులు
భారత ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి పొరుగు దేశాధినేతలు తరలివచ్చారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు మొహ్మద్‌ ముయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, నేపాల్‌ ప్రధాని ప్రచండ, మారిషస్‌ ప్రధానమంత్రి ప్రవింద్‌ కుమార్‌ జుగ్‌నౌద్‌, భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ తోభ్గే, సీషెల్స్‌ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ ఆఫిఫ్‌లు ప్రత్యేక ఆహ్వానితులగా హాజరయ్యారు. మొత్తంగా దాదాపు 8వేల మందికి పైగా అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Last Updated : Jun 9, 2024, 10:55 PM IST

ABOUT THE AUTHOR

...view details