Modi Election Campaign In South India 2024 : లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీని గెలిపించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం మార్చి 17 నుంచి 19 వరకు దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు.
బీజేపీ దక్షిణాదిలో పాగా వేస్తుందా?
దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉంటే, దక్షిణాదిలోని 130 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అయితే దక్షిణ భారతదేశంలో తెలంగాణా, కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా బలం లేదు. కానీ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 370, దాని నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400కు పైగా స్థానాల్లో విజయం సాధించాలని కమల దళం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అందుకే దక్షిణాది ఓటర్లను ఆకట్టుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది.
అసలు గెలిచే అవకాశం ఉందా?
బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరితోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయితే కర్ణాటకలోని 28 సీట్లలో 25 సీట్లు, తెలంగాణలో 17 సీట్లలో 4 సీట్లు కైవసం చేసుకుంది. అయితే ఈ తాజా ఎన్నికల్లో అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో పలు పార్టీలతో పొత్తులు ఏర్పాటు చేసుకుంది. అలాగే మిగతా రాష్ట్రాల్లోని ఇతర పార్టీల నేతలను ఆకర్షించేందుకు కూడా ప్రయత్నిస్తోంది.
మోదీ దూకుడు
ప్రధాని మోదీ ఒక వైపు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ఇలా మోదీ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.