Rahul Gandhi On NEET Issue : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజు లోక్‌సభలో నీట్ పేపర్ లీక్ అంశం చర్చకు వచ్చింది. నీట్ అంశంలో ఏమి జరుగుతుందో తెలియక దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలో ఉన్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ధనికులుగా ఉంటే పరీక్షపేపర్లు కొనవచ్చనే అభిప్రాయం చాలా మందిలో ఉందని వ్యాఖ్యానించారు. తమ కూటమికి ఇదే అభిప్రాయం ఉందని తెలిపారు.
పరీక్షలను నిర్వహించే విషయంలో వ్యవస్థాపరంగా లోపం ఉందన్న రాహుల్ గాంధీ, దీన్ని సరిచేసేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతి ఒక్కరినీ నిందించారని ఆరోపించారు. తన లోపాన్ని మాత్రం కప్పిపుచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.
"మన పరీక్షా విధానంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయన్న విషయం దేశం మెుత్తానికి అర్థమైంది. భారతీయ పరీక్షా విధానం ఒక మోసమని నమ్ముతున్నారు. డబ్బు ఉంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను కొనుగోలు చేయవచ్చని లక్షలాది మంది ప్రజలు విశ్వసిస్తున్నారు. కేవలం నీట్‌లోనే కాదు ప్రతి ప్రధాన పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ నీట్ పేపర్ లీకేజీ అంశంలో ప్రతి ఒక్కరినీ నిందించారు. కాని తన లోపాన్ని మాత్రం కప్పిపుచ్చుకున్నారు. ఇక్కడ ఏమి జరుగుతుందో కూడా ఆయనకు అర్థం కావడం లేదని నేను అనుకుంటున్నాను"
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత