Kerala Temple Blast : ఓవైపు సంప్రదాయ దుస్తుల్లో కళాకారుల ప్రదర్శనలు.. మరోవైపు టపాసులు పేలుళ్ల శబ్దాలు.. అక్కడే ఉండి ఎంతో ఉత్సహంగా తిలకిస్తూ దృశ్యాలను మొబైల్ ఫోన్స్‌లో రికార్డ్ చేస్తున్న భక్తులు.. ఇలా సంబరాలతో నిండిన ఆలయం మొత్తం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఉలిక్కిపడింది. ఏం జరిగిందో అని చూసేసరికి భారీ పేలుడు సంభవించింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ఒక్కసారిగా భయంతో ఆర్తనాదాలు చేస్తు పరుగులు పెట్టారు. దీంతో తొక్కిలాసట జరిగి అనేక మంది గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి కేరళలోని కాసర్‌గోడ్ ఆలయంలో జరిగిన విషాద ఘటన ఇది.
అసలేం జరిగిదంటే!
కాసర్‌గోడ్ జిల్లా నీలేశ్వరం సమీపంలోని అంజోతంబలం వీరర్కవు ఆలయంలో గత రెండు రోజులుగా వార్షిక కాళియాట్లం ఉత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి నిర్వహించిన తెయ్యం ఉత్సవంలో బాణసంచా కాల్చారు. ఈ క్రమంలో నిప్పురవ్వలు ఆలయం సమీపంలోని బాణసంచా నిల్వ ఉంచిన షెడ్డుపై పడగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. బాంబు పేలిందా అనే రీతిలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చి తెయ్యం ఉత్సవాన్ని తిలకిస్తున్న సమయంలోనే ఈ పేలుడు సంభవించింది. ఈ భయానక దృశ్యాలు ఓ మొబైల్ ఫోన్‌లో రికార్డయ్యాయి.