Ayushman Bharat Health Insurance For Senior Citizens : దేశంలో 70ఏళ్లకు పైబడి వృద్ధులకు రూ.5లక్షల ఉచిత ఆరోగ్య బీమా పథకం 'ఆయుష్మాన్ భారత్'ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద-ఏఐఐఏలో జరిగిన కార్యక్రమంలో అర్హులైన వారికి 'అయుష్మాన్ భారత్ వయ వందన' కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ, ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం పురోగతి వేగం పుంజుకుంటుందని అన్నారు. అందుకోసం ఐదు మూలస్తంభాలతో ఆరోగ్యం విధానం ఏర్పాటు చేసిందని తెలిపారు. నివారణ, ఆరోగ్య సంరక్షణ, సకాలంలో రోగనిర్ధరణ, సరసమై ధరల్లో మందులు-చికిత్స, పట్టణాలు- గ్రామాల్లో సరైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ఏర్పాటు- హెల్త్‌కేర్ రంగంలో సాంకేతిక విస్తరణపై దృష్టి సారించామని మోదీ చెప్పారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi hands over Ayushman Vaya Vandana Card to the beneficiaries pic.twitter.com/hWdrtCD0G4
— ANI (@ANI) October 29, 2024
'వారి నిస్సహాయత చూడలేకపోయా'
"పేద ప్రజల కోసం రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు భరించేలా మా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా సూమారు 4 కోట్ల మంది పేదలు లబ్ధి పొందారు. 70ఏళ్లకు పైబడిన వారిని ఆయుష్మాన్ భారత్ కింద కవర్ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఈరోజు నేరవేర్చాం. ఒకప్పుడు వైద్యం కోసం ఇళ్లు, భూములు, నగలు అమ్మేసేవారు. ఇక తీవ్రమైన వ్యాధులు వస్తే- దాని చికిత్సకు అయ్యే ఖర్చు విని వణికిపోయేవారు. డబ్బు లేకపోవడం వల్ల వైద్యం చేయించుకోలేని నిస్సహాయత ఉండేది. ఆ నిస్సహాయతలో నా పేద సోదరీమణులను చూడలేకపోయాను. అందుకే అయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని నిర్ణయించాము" అని ప్రధాని మోదీ అన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi says, " there was a time when people's houses, lands, jewellery were sold for treatment. the soul of the poor trembled on hearing the cost of treatment for a serious disease. the helplessness of not being able to get treatment due to lack of… pic.twitter.com/uwR2QjDEFA
— ANI (@ANI) October 29, 2024
'ఈసారి దీపావళి ప్రత్యేకం'
ధన్వంతర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి జరిగే దీపావళి ప్రత్యేకమన్న మోదీ, ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 500ఏళ్ల తర్వాత అయోధ్య రామాలయంలో దీపాలు వెలిగిస్తారన్నారు. ఈసారి 14సంవత్సరాల తర్వాత కాదు, 500 ఏళ్ల తర్వాత రాముడు అయోధ్యకు తిరిగివచ్చారని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము అన్న మోదీ, ఆయుర్వేద దినోత్సవం పేరుతో ప్రాచీన సంప్రదాయాలు వ్యాప్తి చెందుతున్నాయన్నారు.
"ఆరోగ్యం, ఐశ్వర్యాన్నిచ్చే ఈ పండుగ కేవలం యాదృచ్ఛికమే కాదు, భారతీయ సంస్కృతికి ప్రతీక. ఆరోగ్యమే మహాభాగ్యము అని మన సాధువులు చెప్పారు. ఈ ప్రాచీన ఆలోచనలు ఆయుర్వేద దినోత్సవం పేరుతో విస్తరిస్తున్నాయి. 150కి పైగా దేశాల్లో ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోవడం- ప్రపంచం ఆయుర్వేదం వైపు అట్రాక్ట్ అవుతుంది అనడానికి నిదర్శనం" అని మోదీ తెలిపారు.
వారికి సారీ చెప్పిన మోదీ!
దిల్లీ, బంగాల్లోని వృద్ధులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పారు. రాజకీయ కారణాలతో ఆ రాష్ట్రా ప్రభుత్వాలు ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయడం లేదని విమర్శించారు. వృద్ధులు పడుతున్న బాధలు తెలిసినా ఈ విషయంలో తాను ఏం చేయలేనని అన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi says, " i apologize to all the elderly people above 70 years of age in delhi and all the elderly people above 70 years of age in west bengal that i will not be able to serve you. i apologize to them that i will know how you are, i will get the… pic.twitter.com/zUsP0ktl0B
— ANI (@ANI) October 29, 2024
ఆరు కోట్ల మందికి లబ్ది
దేశవ్యాప్తంగా ఆరు కోట్లమంది వృద్ధులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని అంచనా. ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్న సీనియర్ సిటిజన్లకు కుటుంబ ప్రాతిపదికన ఏటా రూ.5 లక్షల వరకు లబ్ధి పొందుతారు. అన్ని సామాజిక, ఆర్థిక వర్గాల వారికి వైద్యబీమా లభిస్తుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త కార్డులు అందిస్తారు. కాగా, ఇప్పటికే ఈ బీమా పథకం పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు రూ.5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది.
కుటుంబంలో ఇద్దరు ఉంటే ఏలా?
కుటుంబంలో 70 ఏళ్లపైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం, సగం ప్రయోజనం ఉంటుంది. సీజీహెచ్‌ఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్‌స్కీం, ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వృద్ధులు వాటిని గానీ, ఏబీపీఎంజేఏవై(AB-PMJAY) పథకం రెండింట్లో ఒకటి ఎంచుకోవచ్చు. ప్రైవేటు వైద్యఆరోగ్య బీమా, కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్నవారు కూడా ఈ రూ.5 లక్షల ప్రయోజనం పొందొచ్చు.
ఆయుష్మాన్ భారత్- ఇలా అప్లై చేయండి
- PMJAY పోర్టల్‌లో 'యామ్ ఐ ఎలిజిబుల్' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. దీంతో beneficiary.nha.gov.in అనే వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతారు.
- అక్కడ క్యాప్చా, మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చేయాలి.
- తర్వాత కేవైసీ కోసం వివరాలు నమోదు చేసి, ఆమోదం కోసం చూడాలి.
- ఆయుష్మాన్ కార్డు సిద్ధమైన తర్వాత అధికారిక ఆమోదం లభించిన వెంటనే బీమా కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఆధార్‌లో నమోదైన వయసు ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ధ్రువీకరణ పత్రం- ఆధార్ కార్డు