Diwali Celebrations in Telangana : దీపావళి అంటేనే మనందరికీ దీపాల వెలుగులు, కాంతులు. నింగిలోకి దూసుకెళ్లే బాణాసంచా రాకెట్లు. శబ్దాలు చేసే బాంబులు గుర్తొస్తుంటాయి. అయితే ఆ సందడి మాటునే కాలుష్యమూ పొంచి ఉంటోంది. వాటిని కాల్చటం వల్ల విడుదలయ్యే ఉద్గారాలు కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణానికి అనుగుణంగా హరిత బాణాసంచా (గ్రీన్ క్రాకర్స్) అందుబాటులోకి వచ్చాయి. రెండేళ్ల కిందటే మార్కెట్‌లోకి వచ్చాయి. ఈసారి మాత్రం అన్ని మార్కెట్లలో విస్తృతంగానే లభిస్తున్నాయి. వీటి ధరలు కాస్త ఎక్కువే అయినా, పర్యావరణ హితం దృష్ట్యా కొంతమంది వీటివైపే మొగ్గు చూపుతున్నారు.
మనం కాల్చే సాధారణ బాణాసంచా వల్ల అతి సూక్ష్మ ధూళి కణాలు, సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి వాయువులు అధిక మొత్తంలో విడుదలవుతాయి. అనంతరం వాయు కాలుష్యానికి కారణమవుతుంటాయి. కొన్ని రకాల టపాసులలో అధికంగా కాలుష్య ఉద్గారాలను విడుదల చేసే బేరియం, లిథియం, ఆర్సెనిక్ వంటి మూలకాల్ని వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పర్యావరణానికి హాని తలపెట్టని బాణాసంచా తయారీ ఫార్ములాను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్)- నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (నీరి) రూపొందించారు. వాటినే గ్రీన్ కాకర్స్‌గా పిలుస్తున్నారు.
తక్కువ ప్రమాదకరం
* సాధారణ బాణసంచాతో పోలిస్తే ఇవి 30- 40 శాతం మేర తక్కువగా కాలుష్యకారకాలను విడుదల చేస్తాయి.
* టపాసులు కాల్చేప్పుడు 160 డెసిబెల్స్ మేర శబ్దం వస్తే వీటి ద్వారా 100-125 డెసిబెల్స్ శబ్దం మాత్రమే వస్తుంది.
* చిన్నచిన్న బాంబుల తయారీలో 33 శాతం అల్యూమినియం, 9 శాతం సల్ఫర్, 57 శాతం పొటాషియం నైట్రేట్ వంటి రసాయనాలను వినియోగిస్తారు. గ్రీన్ క్రాకర్‌లో ఈ రసాయన సమ్మేళనం చాలా తక్కువ మోతాదులో ఉంటుంది.
హరిత కాకర్స్- రకాలు
* సేఫ్ వాటర్ రిలీజర్ (స్వాస్): పొటాషియం నైట్రేట్, సల్ఫర్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. వీటిని కాల్చేటప్పుడు నీటి ఆవిరి విడుదలవుతుంది. గాల్లోకి ధూళి కణాలు చేరకుండా నీటి ఆవిరి ఉపయోగపడుతుంది.
* సేఫ్ థర్మటిక్ క్రాకర్ (స్టార్): దీనిలో సల్ఫర్, పొటాషియం నైట్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. నైట్రోజన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్లు అతి తక్కువ మోతాదులో విడుదలవుతాయి.
* సేఫ్ మినిమల్ అల్యూమినియం (సఫల్): అతి తక్కువ మోతాదులో ధూళికణాలు విడుదలయ్యేందుకు వీలుగా అల్యూమినియం బదులుగా ఇందులో మెగ్నీషియం వినియోగిస్తారు.
మార్కెట్లో వీటిని ఇలా గుర్తించండి
* లోగో: మీరు కొనుగోలు చేసే బాణసంచా బాక్స్ పైన సీఎస్‌ఐఆర్(CSIR)- నీరి(NEERI) సంస్థలకు సంబంధించిన లోగో గ్రీన్ ఫైర్ వర్క్స్ పేరిట ఉంటుంది. పెట్రోలియం అండ్ పేసో లైసెన్సు పొందినట్లు ఉంటుంది.
* క్యూఆర్ కోడ్ : ఈ బాణసంచా బాక్స్ పైన ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే అది మంచిదా.. నకిలీదా? అని గూగుల్ తల్లి వెంటనే చెప్పేస్తుంది. ఏయే ముడి పదార్థాలు ఎంత మోతాదులో వాడారో కూడా కనుక్కోవచ్చు.
ఎక్కడ లభిస్తాయి?
* రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ గ్రీన్ క్రాకర్స్ లభిస్తాయి.
* సాధారణ వాటితో పోలిస్తే 10-20 శాతం వరకూ ధర ఎక్కువగా ఉంటాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో వివిధ సంస్థలు వీటిని విక్రయిస్తున్నాయి.
వెలుగుల పండుగ వేళ : టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు మరవొద్దు!
దీపావళి వేళ - ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు సూపర్ ఐడియాస్ - ఓ లుక్కేయండి మరి!