Naraka Chaturdashi 2024 : తెలుగు పండుగల్లో నరక చతుర్దశి, దీపావళి ప్రముఖమైనవి. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. సాధారణంగా దీపావళి ముందు రోజు భక్తులు నరక చతుర్దశి జరుపుకుంటారు. ఈ కథనంలో అసలు నరక చతుర్దశి పండుగ ఎందుకు చేసుకుంటాం? దీని వెనుక ఉన్న పౌరాణిక గాథ ఏమిటి? నరక చతుర్దశి పండుగను జరుపునే సాంప్రదాయ పద్ధతి ఏమిటి? అనే వివరాలను తెలుసుకుందాం.
మరణం లేకుండా వరం పొందిన నరకుడు
ప్రాగ్జ్యోతిష్య పురాన్ని పరిపాలించే నరకాసురుడనే రాక్షసుడిని, శ్రీకృష్ణుడు, సత్యభామ సమేతంగా తరలివెళ్లి సంహరించిన రోజునే నరక చతుర్దశిగా జరుపుకుంటాం. వరాహ పురాణం ప్రకారం, శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని ఉద్ధరిస్తాడు. ఆ సమయంలో వరాహ రూపంలోని శ్రీ మహావిష్ణువు భూదేవిని వివాహం చేసుకుంటాడు. వారికి నరకుడు జన్మిస్తాడు. ఈ నరకుడు పరమ శివుని ప్రార్థించి తన తల్లి వల్ల తప్ప మరెవరి వలన చావు లేకుండా వరం పొందుతాడు. తల్లి తన బిడ్డను సంహరించదు కదా అనే ధైర్యంతో నరకుడు ఈ వరాన్ని కోరుకుంటాడు.
వరగర్వంతో నరకుని దురాగతాలు
వరగర్వంతో నరకాసురుడు స్వర్గంలోనూ, భూలోకంలోనూ పెను విధ్వంసం సృష్టించాడు. ఋషులను, సాధువులను, మానవులను మాత్రమే కాదు, చివరకు దేవతలను కూడా హింసించాడు. చాలా మంది రాజులను, పదహారు వేల మంది రాజకుమార్తెలను బంధించాడు. వారిని బలవంతంగా వివాహం చేసుకోవాలనుకున్నాడు.
నరకునిపై యుద్ధానికి సతీసమేతంగా బయల్దేరిన కృష్ణుడు
నరకాసురుడి దుశ్చర్యలతో కలత చెంది ఒకరోజు దేవతల అధినేత ఇంద్రుడు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి నరకాసురుడి దురాగతాలన్నీ చెప్పాడు. నరకాసురుడు నుంచి తమకు విముక్తి ఇవ్వమని కోరుకున్నాడు. అయితే నరకాసురుడు మరణం కేవలం అతని తల్లి చేతిలో మాత్రమే ఉందని శ్రీ కృష్ణుడికి తెలుసు. అందుకనే శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసురుడిపై యుద్ధం చేయడానికి వెళ్ళాడు.
నరకాసుర సంహారం
నరకాసురుడు తన సైన్యంతో శ్రీ కృష్ణుడితో యుద్ధం చేయడానికి వచ్చాడు. నరకాసురుని దెబ్బకు శ్రీ కృష్ణుడు మూర్ఛపోతాడు. అప్పుడు సత్యభామ కోపంతో నరకాసురుని వధిస్తుంది. వాస్తవానికి భూదేవియే సత్యభామ రూపంలో నరకాసురుని సంహరించింది. నరకాసురుని వధించిన రోజు ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి కనుక ఈ తిథిని నరక చతుర్దశి అంటారు.
పుణ్యప్రదం నరక చతుర్దశి స్నానం
పురాణాల ప్రకారం, నరక చతుర్దశి రోజు స్నానం చాలా పుణ్యప్రదం. ఈ రోజు తెల్లవారుజామునే నరకాసుర దహనం చేస్తారు. ఈ రోజు ఇంట్లోని వారందరూ నువ్వుల నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేయాలి. ఈ పండుగ రోజున బంధు మిత్రులంతా ఒక దగ్గర కలుస్తారు. లోక కంటకుడైన నరకాసురుని పీడ వదిలినందుకు ఈ రోజు ఇంటిల్లిపాది కొత్త దుస్తులు ధరించి, పిండివంటలతో భోజనం చేస్తారు.
అపమృత్యు భయాలను పోగొట్టే యమ దీపం
నరక చతుర్దశి రోజు సాయంత్రం వెలిగించే దీపానికి ఓ ప్రాశస్త్యం ఉంది. ఈ రోజు దక్షిణం దిక్కుగా వెలిగించే దీపాన్ని యమదీపం అంటారు. అపమృత్యు భయాలను పోగొట్టడానికి ఈ రోజు యమ దీపం వెలిగిస్తారు. తరువాత నరకాసురుని వధ జరిగినందుకు ఆనందంగా టపాసులు కాల్చి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
లోక కంటకుడైన నరకుని పీడ వదిలినందుకు ఆనందంగా జరువుకునే నరక చతుర్దశి పండుగ మనందరి ఇంట సకల పీడలు తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ నరక చతుర్దశి శుభాకాంక్షలు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.