Manish Sisodia Interim Bail : మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోదియాకు దిల్లీ కోర్టు మూడు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తన మేనకోడలి వివాహనికి హజరయ్యేందుకు మూడు రోజులు బెయిల్ ఇవ్వాలని సిసోదియా కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు మూడు రోజుల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేశారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో 2023 ఫిబ్రవరి 26న మనీశ్ సిసోదియాను సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత మార్చి 9న ఈడీ కూడా సిసోదియాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన కస్టడీపై తిహాడ్ జైల్లో ఉన్నారు. ఈ కేసుల్లో బెయిల్ కోసం కింది కోర్టుల్లో ఊరట లభించకపోవడం వల్ల సిసోదియా గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా సుప్రీం అందుకు నిరాకరించింది.
ఇదీ దిల్లీ మద్యం కుంభకోణం కేసు
దిల్లీ మద్యం కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజకీయంగానూ దుమారం రేపింది. 2021-22 ఆర్థిక సంవత్సరం కోసం దిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీలో అనేక లోటుపాట్లు ఉన్నాయనే ఆరోపణలు రావడం ఇందుకు ప్రధాన కారణం. కొందరికి అనుచిత లబ్ధి చేకూర్చేలా ఈ నూతన మద్యం విధానం తయారు చేశారని విమర్శలు వెల్లువెత్తాయి.