Manipur CRPF Encounter Today : మణిపుర్లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. జిరిబామ్ జిల్లాలో సీఆర్పీఎఫ్ సిబ్బంది, మిలిటెంట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో 11 మంది అనుమానిత మిలిటెంట్లు మృతి చెందారు. బోరోబెక్ర సబ్ డివిజన్లోని జాకురదోర్ కరోంగ్ వద్ద జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందికి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
అనుమానిత మిలిటెంట్ల మృతదేహాలను ఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకుని బోరోబెక్ర పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం- భారీగా ఆధునాతన ఆయుధాలు కలిగిన మిలిటెంట్లు సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో బోరోబెక్ర పోలీస్ స్టేషన్‌పై కాల్పులు జరిపారు. అనంతరం ఆ పక్కనే ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేశారు. ఆ తర్వాత కొంత మంది మిలిటెంట్లు- అక్కడికి 100 మీట్లర్ల దూరంలో ఉన్న జాకురదోర్ కరోంగ్ మార్కెట్లోని పలు దుకాణాలకు నిప్పంటించారు. పక్కనున్న కొన్ని ఇళ్లపై దాడి చేశారు. దీంతో సీఆర్పీఎఫ్ సిబ్బంది మిలిటెంట్లపైకి కాల్పులు జరిపారు.
సీఆర్పీఎఫ్ సిబ్బంది, మిలిటెంట్లకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్న క్రమంలో- పోలీస్టేషన్ సమీపంలో ఉన్న సహాయక శిబిరంలోని ఐదుగురు పౌరులు కనిపించకుండా పోయారు. అయితే వారిని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారా లేదా కాల్పుల భయంతో ఎక్కడైనా దాక్కున్నారా అనే విషయంపై స్పష్టత లేదని అధికారులు చెప్పారు.
కాగా, ఈ ఘటన తర్వాత బీఎన్ఎస్లోని సెక్షన్ 163 కింద స్థానికంగా నిషేదాజ్ఞలు విధించారు. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ జారీ చేశారు అధికారులు.