Man Kidnapped By Relatives: సొంత బంధువులే ఓ వ్యక్తి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. సదరు వ్యక్తిని కిడ్నాప్ చేసి గుండు కొట్టించి, మహిళ దుస్తులు తొడిగించి, బలవంతంగా మూత్రం తగించారు. ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఆపై రూ.25 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
గుణలో కిడ్నాప్- రాజస్థాన్‌లో దాడి!
గుణ జిల్లాలోని మావన్ గ్రామంలో కూలీ పని చేసుకుంటున్న ఓ వ్యక్తిని తన కజిన్ భర్త కూల్‌డ్రింక్స్ తాగుదామని మే 22న దుకాణానికి తీసుకెళ్లాడు. అక్కడ 10-12మంది వ్యక్తులు కలిసి అతడిని కిడ్నాప్ చేసి రాజస్థాన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత బాధితుడిపై దాడి చేసి గుండు కొట్టించారు. అనంతరం మహిళల దుస్తులు తొడిగించి మెడలో చెప్పుల దండ వేసి బలవంతంగా మూత్రం తాగించారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడం వల్ల మూడు రోజుల్లోగా రూ.20లక్షలు ఇవ్వాలని హెచ్చరించి బాధితుడిని వదిలేశారు.
నగదు విషయంలో వివాదం
అయితే సోమవారం రాత్రి ఈ విషయంపై బాధితుడు గుణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఏడుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితుడి కుటుంబసభ్యులకు, అతడి కజిన్ భర్తకు మధ్య డబ్బు విషయంలో వివాదం నడుస్తోందని పోలీసులు తెలిపారు. ఆ విషయంలోనే బాధితుడితో ఆ వ్యక్తి అమానవీయంగా ప్రవర్తించారని తెలిపారు. ఈ ఘటన మే 22న రాజస్థాన్‌లో జరిగిందని ఎస్పీ సంజీవ్ సిన్హా తెలిపారు. బాధితుడిపై రాజస్థాన్‌లోనే దాడి జరిగినా, గుణ జిల్లాలో కిడ్నాప్ చేశారు కనుక, ఇక్కడే కేసు నమోదు చేశామని ఎస్పీ సంజీవ్ సిన్హా తెలిపారు.
మద్యం తాగడానికి అంగీకరించలేదని!
తమతోపాటు మద్యం తాగేందుకు అంగీకరించలేదని ఒక వ్యక్తిని మరో నలుగురు వ్యక్తులు మేడపై నుంచి కిందకు తోసేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో జరిగింది. స్థానిక రుప్పుర్ ఖద్రా అనే ప్రదేశంలో రంజిత్ సింగ్ అనే వ్యక్తిని ఈ కేసులో బాధితుడిగా గుర్తించారు. బాధితుడు రంజిత్‌ను నలుగురు వ్యక్తులు శనివారం ఇంటి డాబాపైకి తీసుకెళ్లారు. మద్యం తాగే విషయంలో గొడవపడి రంజిత్‌పై దౌర్జన్యానికి దిగారు. ఒక దశలో ఇది శ్రుతి మించి రంజిత్‌ను ఒక వ్యక్తి డాబాపై నుంచి కిందకు తోసేశాడు. మిగిలిన ముగ్గురు అతడిపై దాడి చేశారు. స్థానికులు రంజిత్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.