Mamata On Congress :వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే బంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బంగాల్‌లో బీజేపీని బలోపేతం చేసేందుకు సీపీఐ(ఎం)తో కాంగ్రెస్ జతకట్టిందని మమత ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీతో రాజకీయంగా పోరాడే సత్తా తృణమూల్ కాంగ్రెస్‌కు తప్ప మరే పార్టీకి లేదని చెప్పారు. బీజేపీతో తమ యుద్ధం కొనసాగుతుందని తెలిపారు.
రాష్ట్రంలో రెండు స్థానాల్లో పోటీ చేయాలన్న తన ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించడం వల్ల, బంగాల్‌లో రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. కొన్ని పార్టీలు వసంతకాలంలో కోకిలలు వచ్చి వాలినట్లు, కేవలం ఎన్నికల అప్పుడు మాత్రమే కనిపిస్తాయని వ్యాఖ్యానించారు. సీపీఐ(ఎం) తన 34 ఏళ్ల పాలనలో బంగాల్ రాష్ట్ర ప్రజలను హింసించిందని ఆరోపించారు.
"కాంగ్రెస్‌కు రాష్ట్ర అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. నేను వారికి మాల్దాలో రెండు లోక్‌సభ స్థానాలు ఇచ్చాను, కానీ వారు ఎక్కువ కోరుకున్నారు. కాబట్టి నేను వారితో ఒక్క సీటు కూడా పంచుకోనని చెప్పాను. సీపీఐ(ఎం) వారి నాయకుడా ఆ పార్టీ పెట్టిన చిత్రహింసలు మరిచిపోయారా? సీపీఐ(ఎం)ని నేను ఎప్పటికీ క్షమించను. సీపీఐ(ఎం)కు మద్దతిచ్చే వారిని కూడా క్షమించను. ఎందుకంటే అలా చేయడం వల్ల వాళ్లు బీజేపీకి మద్దతిచ్చారు. గత పంచాయతీ ఎన్నికల్లో అదే జరిగింది"