Mamata Banerjee Injury : బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మమత ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొనకుండా ఉండేందుకు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఆమె కోల్‌కతాకు చేరుకున్నారు. వైద్యుల బృందం సీఎంకు చికిత్స అందించింది.
అసలేమైందంటే?
అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించేందుకు బుధవారం మధ్యాహ్నం సీఎం మమత తూర్పు బర్ధమాన్ వెళ్లారు. అక్కడి నుంచి వాయుమార్గంలో కోల్‌కతా రావాల్సి ఉండగా, వర్షం కారణంగా వాతావరణం అనుకూలించలేదు. దీంతో ఆమె రోడ్డు మార్గంలో బయల్దేరారు. పొగమంచు ఎక్కువగా ఉండటం వల్ల రహదారిపై సమీపంలోకి వాహనాలు వస్తే తప్ప కనిపించని పరిస్థితి ఏర్పడింది.
ఈ సమయంలో ఎదురుగా ఉన్న మరో వాహనాన్ని తప్పించేందుకు డ్రైవర్ ఉన్నట్టుండి కారుకు బ్రేక్‌లు వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న దీదీ విండ్‌షీల్డ్‌కు ఢీకొనడం వల్ల తలకు స్వల్ప గాయమైనట్టు అధికారులు వెల్లడించారు. వెంటనే ఆమెను మరో వాహనంలో కోల్‌కతాకు తరలించినట్లు తెలిపారు. అయితే మమతా గాయపడిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందించారు. మమత త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
'ప్రజల ఆశీర్వాదంతోనే క్షేమంగా బయటపడ్డాను'
అయితే ప్రమాదం తర్వాత కోల్‌కతా వచ్చిన మమతా బెనర్జీ రాజభవన్లో బంగాల్ గవర్నర్ ఆనంద బోస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత మీడియాతో మమత మాట్లాడారు. తన గాయంపై కూడా స్పందించారు. "నాకు జ్వరం వస్తున్నట్లు అనిపిస్తుంది. చలిగా అనిపిస్తోంది. నా కారు ముందు ఒక వాహనం అకస్మాత్తుగా వచ్చింది. సడెన్ బ్రేక్‌లు వేశాడు డ్రైవర్. తలకు గాయం అయింది. నేను ఇంటికి వెళ్తున్నాను. ప్రజల ఆశీర్వాదం వల్ల నేను క్షేమంగా ఉన్నాను" అని మమత తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
మరోవైపు మమత బుధవారం ఉదయమే కీలక ప్రకటన చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బంగాల్‌లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తెలిపారు. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని తెలిపారు. ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని దీదీ వెల్లడించారు.
'బంగాల్ వరకు సీట్ల పంపకం విషయంలో మా పార్టీ కాంగ్రెస్‌తో టచ్‌లో లేదు. ఈ అంశంపై మేం ఇప్పటివరకు ఆ పార్టీలో ఎవరితోనూ మాట్లాడలేదు. మా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో మేం ఒంటరిగా పోటీ చేస్తాం. ఎన్నికల తర్వాత అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం' అని మమత స్పష్టం చేశారు. అయితే దీదీ లేకుండా ఇండియా కూటమిని ఊహించుకోలేమని కాంగ్రెస్ చెప్పింది. బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో గత ఏడాది విపక్ష ఇండియా కూటమి ఏర్పడింది. కానీ ఈ ప్రకటనలతో విపక్ష పార్టీల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి.