Mamata Banerjee Injured :బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి తీవ్ర గాయమైంది. ఆమె నుదుటి గాయానికి సంబంధించిన ఫొటోలను టీఎంసీ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. దీదీ కోలుకోవాలంటూ ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. అయితే కాళీఘాట్‌లోని తన నివాసంలోనే మమత గాయపడినట్లు తెలుస్తోంది.
తన గదిలో నుంచి బయటకు వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మమతా బెనర్జీ కిందపడి గాయపడ్డట్లు ఎస్ఎస్కేఎమ్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మణిమోయ్ బంధోపాధ్యాయ తెలిపారు. గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో తమకు సమాచారం అందినట్లు వెల్లడించారు. 'ఈ ప్రమాదంలో ముఖ్యమంత్రికి నుదుటిపై, ముక్కుమీద పదునైన కోత పడింది. దాని వల్ల రక్తస్రావం అయింది. మా ఆస్పత్రి వైద్యులు పరిస్థితిని అంచనా వేసి ఆమె నుదిటిపై మూడు, ముక్కు మీద ఒక కుట్లు పడ్డాయి. ఆ తర్వాత పట్టీ కట్టి, అవసరమైన ఈసీజీ, సీటీ వంటి పరీక్షలు చేశాము. అయితే ఆస్పత్రిలో ఉండడానికి మమతా నిరాకరించారు. దీంతో ఆమెను డిశ్చార్జ్ చేశాము. అయినా ముఖ్యమంత్రి ఆరోగ్యాన్ని నిశితంగా గమనిస్తాం. వైద్య బృందం సూచనలకు అనుగుణంగా చికిత్స అందిస్తాం.' అని డాక్టర్ బంధోపాధ్యాయ వివరించారు.
మోదీ స్పందన
మరోవైపు ముఖ్యమంత్రి మమతా త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్‌లో ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ కూడా దీదీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మమతా త్వరగా కోలుకోవాలంటూ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. వీరిలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. వీలైనంత త్వరగా దీదీ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు బంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ట్వీట్ చేశారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక దీదీని పరామర్శించేందుకు కోల్‌కతా నగర మేయర్ ఫిరాద్ హకీం సహా ఇతర పార్టీ నేతలు ఆస్పత్రికి వెళ్లారు.