Mamata Banerjee On Doctor Case : కోల్‌కతా ఆర్జీ కార్ ఆసుపత్రిలో వైద్యవిద్యార్థిని హత్యాచార ఘటనపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆమె కుటుంబానికి సంఘీభావం తెలిపారు. తృణమూల్ ఛాత్ర పరిషత్ వ్యవస్థాపక దినోత్సవాన్ని బాధితురాలికి అంకితం చేస్తున్నట్లు మమతా బెనర్జీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆగస్టు 9 నాటి ఘటనకు తక్షణ పరిష్కారాన్ని ఆశిస్తున్నట్లు మమత తెలిపారు. దేశమంతా ఇలాంటి అమానవీయ ఘటనలకు గురైన అన్ని వయసుల మహిళలకు తమ సానుభూతి తెలియజేస్తున్నట్లు ముఖ్యమంత్రి బెంగాలీలో పోస్ట్ చేశారు. విద్యార్థులకు, యువతకు గొప్ప సామాజిక పాత్ర ఉందన్న ఆమె, 'విద్యార్థులారా క్షేమంగా, ఆరోగ్యంగా, ఉజ్వల భవిష్యత్తు కోసం కట్టుబడి ఉండండి' అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
''ఈ రోజు నేను తృణమూల్ ఛాత్ర పరిషత్ ( తృణమూల్ విద్యార్థి సంఘం) స్థాపన దినోత్సవాన్ని మా సోదరికి అంకితం చేస్తున్నాను. కొన్ని రోజుల క్రితం ఆర్జీ కర్ హాస్పిటల్ హత్యాచార ఘటనలో మేము నిన్ను కోల్పోయాం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మా సోదరి కుటుంబానికి సత్వర న్యాయం కోరుతున్నా. అలాగే భారతదేశం అంతటా ఇటువంటి అమానవీయ ఘటనలకు గురైన అన్ని వయసుల మహిళలందరికీ మా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా.'' అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కొనసాగుతున్న ఆందోళనలు : బంగాల్ జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనపై బంగాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసు విషయంలో మమత సర్కార్ అనుసరిస్తున్న విధానానికి నిరసనగా బీజేపీ బుధవారం 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. మంగళవారం జరిగిన ‘నబన్నా అభియాన్’ ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం పట్ల బీజేపీ పార్టీ మండిపడుతూ ఈ బంద్ చేపట్టింది. దీంతో బంగాల్ స్తంభించింది.