Maldives President Visit To India :భారత్-మల్దీవుల సంబంధాలలో అభివృద్ధి భాగస్వామ్యం ఒక మూల స్తంభంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మల్దీవుల ప్రజల ప్రయారిటీలకు తాము ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చామని ఆయన చెప్పారు. ఈ ఏడాది మల్దీవుల ట్రెజరీ బెంచ్‌లో ఎస్బీఐ 100 మిలియన్ డాలర్లను రోల్ ఓవర్ చేసిందన్నారు. ఆ దేశ అవసరాలకు అనుగుణంగా 400 మిలియన్ డాలర్లు, రూ.3 వేల కోట్లు కరెన్సీ మార్పిడి ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఇక ఇరు దేశాలకు వాతావరణ మార్పులు అతి పెద్ద సవాలు అన్న మోదీ- సౌరశక్తి, ఇంధన సామర్థ్యానికి సంబంధించి భారత్ తన అనుభవాలను మాల్దీవులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు.
"మల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, ఆయన ప్రతినిధి బృందానికి నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు శతాబ్దాల నుంచి ఉన్నాయి. భారత్, మాల్దీవులకు సమీప పొరుగు దేశం. సన్నిహిత మిత్ర దేశం. మా పొరుగు దేశాల విధానం, SAGAR విజన్‌లో మాల్దీవులకు ముఖ్యమైన స్థానం. మల్దీవులకు ఏ అవసరం వచ్చినా భారత్ ఫస్ట్ రెస్పాండర్ పాత్ర పోషించింది. ఒక పొరుగు దేశానికి ఉన్న బాధ్యతలన్నీ భారత్ అన్ని వేళలా నిర్వర్తిస్తూ వస్తోంది. ఇరు దేశాల సహకారానికి వ్యూహాత్మక దిశను నిర్దేశించడం కోసం- సమగ్ర ఆర్థిక, సముద్ర భద్రత వంటి కీలక రంగాల్లో భాగస్వాములం అయ్యాం." అని ప్రధాని మోదీ అన్నారు.
మా అభివృద్ది భారత్ కీలక భాగస్వామి : మల్దీవుల అధ్యక్షుడు
భేటీ తర్వాత మొహమ్మద్ ముయిజ్జు ప్రసంగించారు. మల్దీవుల సామాజిక-ఆర్థిక, మౌలికవసతుల అభివృద్ధిలో కీలక భాగస్వామి అని ఆయన అన్నారు. కష్ట సమయాల్లో మల్దీవులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ఇన్నేళ్లుగా తమ దేశానికి ఉదారమైన సహాయం అందించినందుకు ప్రధాని మోదీ, భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను నిర్దేశిస్తూ సమగ్ర దార్శనిక పత్రంపై ఒప్పందం కుదిరిందని తెలిపారు.