తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అప్పటిలోగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు- ఓటింగ్ పెంచేందుకు ప్రయత్నిస్తాం' - Maharashtra Elections 2024

Maharashtra Elections 2024 : మహారాష్ట్రలో నవంబర్ 26లోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎన్నికల సన్నద్ధతపై రాజకీయ పార్టీలు సహా అన్ని వర్గాలతో భేటీ అయ్యామని వెల్లడించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నేరచరిత్రను ఓటర్లకు ఆయా రాజకీయ పార్టీలు తెలియజేయాలని వ్యాఖ్యానించారు.

Maharashtra Elections 2024
Maharashtra Elections 2024 (ANI)

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2024, 5:31 PM IST

Maharashtra Elections 2024 :మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై రాజకీయ పార్టీలు సహా అన్ని వర్గాలతో భేటీ అయ్యామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. మహారాష్ట్రలో నవంబర్ 26లోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. దీపావళి వంటి పండగలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను రూపొందించాలని రాజకీయ పార్టీలు కోరాయని వెల్లడించారు. ప్రజాస్వామ్య పండుగకు మహారాష్ట్ర సిద్ధమవుతుందని విశ్వసిస్తున్నామని చెప్పుకొచ్చారు. ముంబయిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికల సన్నద్ధతపై కీలక వ్యాఖ్యలు చేశారు.

'పోలింగ్ పెంపునకు కృషి'
అసెంబ్లీ ఎన్నికల కోసం మహారాష్ట్రలో 1,00,186 పోలింగ్ బూత్​లు ఏర్పాటు చేస్తామని రాజీవ్ కుమార్ వెల్లడించారు. దేశంలోనే అతి తక్కువ ఓటింగ్ శాతాన్ని నమోదు చేస్తున్న కొన్ని పట్టణ కేంద్రాలు మహారాష్ట్రలో ఉన్నాయని తెలిపారు. ఓటు వేసేందుకు పట్టణ ఓటర్లు ముందుకు రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ శాతం పోలింగ్ నమోదయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది జరిగిన లోక్​సభ ముంబయి, దాని చుట్టుపక్కల ఉన్న కొలాబా, కల్యాన్ వంటి ప్రాంతాల్లో తక్కువ ఓటింగ్ నమోదైందని తెలిపారు. రోజువారీ కూలీలు, అసంఘటిత రంగంలో పనిచేసేవారికి పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవును ప్రకటించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

'ఆ విషయాన్ని ఓటర్లకు తెలియజేయాల్సిందే'
3 ఏళ్లకు పైగా సొంత జిల్లాలో లేదా ప్రస్తుతం పోస్టింగ్‌లో ఉన్న ప్రదేశంలో పనిచేసిన అధికారులను బదిలీ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీచేసే ఏ అభ్యర్థికైనా నేర నేపథ్యం ఉందో? లేదో? తెలుసుకోవడం ఓటర్ల హక్కు అని వివరించారు. అందుకే రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల నేరచరిత్రను ఓటర్లకు తెలియజేయాలని వ్యాఖ్యానించారు.

'వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం'
"మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో ఎస్​సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు 25. ఎస్​టీ రిజర్వుడ్ స్థానాలు 29. మహారాష్ట్ర శాసనసభ పదవీకాలం నవంబర్ 26తో ముగుస్తుంది. కాబట్టి దానికంటే ముందే ఎన్నికలను పూర్తి చేయాలి. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 9.59 కోట్లు. అందులో పురుష ఓటర్లు 4.59 కోట్లు కాగా, మహిళా ఓటర్లు 4.64 కోట్లు. 18-19 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లు 19.48 లక్షల మంది ఉన్నారు. ఎన్నికల సమయంలో అన్ని హెలికాప్టర్లను తనిఖీ చేస్తాం. ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం, డీప్​ఫేక్ టెక్నాలజీని ఉపయోగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం." అని సీఈసీ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు.

ఈసీఐ సమీక్ష
మరోవైపు, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై భారత ఎన్నికల సంఘం సమీక్ష జరిపింది. ఈ సందర్భంగా 2024 లోక్​సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలో నేరాలకు సంబంధించిన ఎఫ్ఐఆర్​లను పరిశీలించాలని జిల్లా ఎస్పీలను ఆదేశించింది. సిబ్బందిపై దాడి, ఈవీఎం, సోషల్ మీడియాకు సంబంధించిన అన్ని కేసులను సమీక్షించాలని కోరింది. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌ లపై వేగంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు, ఓటరు క్యూలను సక్రమంగా నిర్వహించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలను ఆదేశించింది. ఓటర్లకు తాగునీరు వంటి సదుపాయాలను అందించాలని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details