తెలంగాణ

telangana

ETV Bharat / bharat

288 సీట్లు, 4,136 మంది అభ్యర్థులు, 9.63 కోట్ల మంది ఓటర్లు - 'మహా' సంగ్రామానికి అంతా రెడీ! - MAHARASHTRA ELECTION 2024

నవంబరు 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు - తేలనున్న మహావికాస్ అఘాడీ, మహాయుతి కూటముల భవితవ్యం!

Maharashtra election 2024
Maharashtra election 2024 (ETV Bharagt)

By ETV Bharat Telugu Team

Published : Nov 19, 2024, 8:49 PM IST

Maharashtra Election 2024 : మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. ఓటింగ్‌ కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు తీసుకొని పోలింగ్‌ సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన కేంద్రాలకు తరలివెళ్లారు. ఇదే రోజు ఝార్ఖండ్‌లో 38 స్థానాలకు గాను రెండో విడత పోలింగ్ జరగనుంది.

పోలింగ్​కు అంతా రెడీ!
మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. 288 స్థానాల‌కుగాను మొత్తం 4,136 మంది అదృష్టం పోటీ చేస్తున్నారు. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మహారాష్ట్రలో 9,63,69,410 మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. అందుకే 1,00,186 పోలింగ్‌ బూత్‌లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు ఈసీ తెలిపింది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.

'మహా' సంగ్రామం
మహారాష్ట్రలో బీజేపీ, అజిత్​ పవార్​-ఎన్​సీపీ, ఏకనాధ్​ శిందే నేతృత్వంలోని శివసేన కలిసి మహాయుతిగా ఏర్పడ్డాయి. దీనికి పోటీగా కాంగ్రెస్​, శివ సేన (యూబీటీ), ఎన్​సీపీ (శరద్ పవార్​) కలిసి మహావికాస్​ అఘాడీగా ఏర్పడ్డాయి. వీటి మధ్యే ప్రధానంగా పోటీ జరగనుంది.

అధికార కూటమి మహాయుతిలో భాగమైన బీజేపీ 149 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన 81 మందిని బరిలోకి దింపింది. ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ 59 మంది అభ్యర్థులను పోటీకి నెలబెట్టింది.

ఇక విపక్ష కూటమి మహావికాస్ అఘాడీ (MVA)లో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్‌ పవార్‌కు చెందిన ఎన్సీపీ ఉన్నాయి. కాంగ్రెస్‌ 101 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. శివసేన యూబీటీ 95 మందిని, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ 86 మందిని పోటీకి దించింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరని కొన్ని స్థానాల్లో కూటమి పక్షాలు స్నేహపూర్వక పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 237 మంది అభ్యర్థులను నిలపగా, ఎంఐఎం కూడా తమకు పట్టుందని భావిస్తున్న 17 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది.

ఝార్ఖండ్​లో రెండో విడత పోలింగ్​!
ఝార్ఖండ్‌లో రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్​డీఏ, ఇండియా కూటమి హోరాహోరీకి సిద్ధమయ్యాయి. 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రయత్నిస్తుండగా, మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం)- కాంగ్రెస్‌ కూటమి చూస్తోంది. దీనితో పోటీ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.

ఝార్ఖండ్​లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మొదటి దశలో 43 స్థానాలకు పోలింగ్ జరిగింది. రెండో దశలో మిగిలిన 38 స్థానాలకు పోలింగ్ జరగనుంది. నవంబర్​ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఫలితాలను తేల్చేది వారే!
ఝార్ఖండ్​లో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బుధవారం జరగనున్న పోలింగ్​లో ఏకంగా 18 అసెంబ్లీ స్థానాల ఫలితాలను సంతాల్‌ గిరిజనులే తేల్చనున్నారు. ఇది ఝార్ఖండ్‌ ముక్తి మోర్చాకు (జేఎంఎం) అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే జేఎంఎంకు ఈ ప్రాంతం కంచుకోట. పైగా ఈసారి ఇక్కడ రక్త సంబంధీకుల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొనడం ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుత ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ బర్హైట్‌ నుంచి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన మరో నియోజకవర్గం దుంకా నుంచి ఈసారి ఆయన సోదరుడు బసంత్‌ సోరెన్‌ పోటీ చేస్తున్నారు. హేమంత్‌ గతంలో దుంకాను వదులుకోవడం వల్ల బసంత్‌ ఉపఎన్నికల్లో గెలిచారు. జమాలో హేమంత్‌ వదిన సీతా సోరెన్‌ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆమె ఇటీవలే జేఎంఎం నుంచి బీజేపీలోకి మారారు. గాండేయ్‌లో హేమంత్‌ సతీమణి కల్పనా సోరెన్‌ పోటీ చేస్తున్నారు. ఇక్కడ గిరిజనులు, ముస్లింలు కలిపి 40 శాతం వరకు ఉన్నారు. ఇది కల్పనకు కలిసొచ్చే అంశమని చెప్పవచ్చు.

ABOUT THE AUTHOR

...view details