Maharashtra Polls Nominations :మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. సోమవారం రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, ఎన్సీపీ అధినేత, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు తమ పార్టీ పోటీ చేస్తున్న స్థానం నుంచే కాంగ్రెస్ మరో అభ్యర్థిని ప్రకటించడంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోప్రీ- పాచ్‌పాఖడీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే నామినేషన్ దాఖలు చేశారు. ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఇతర నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లిన శిందే ఎన్నికల అధికారికి నామపత్రాలు సమర్పించారు. శిందేపై పోటీగా ఆయన రాజకీయ గురువు ఆనంద్ దిఘే మేనల్లుడు కేదార్ దిఘే దిగారు.
మరోవైపు ఎన్సీపీ అధినేత, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనపై పోటీగా ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి యుగేంద్ర పవార్ బరిలోకి దిగారు. ఇక మంగళవారంతోనే నామినేషన్ల గడువు ముగుస్తుంది. 288 స్థానాలున్న మహారాష్ట్రలో ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. శివసేన, ఎన్సీపీ చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
'వాటి వల్లే కూటమిలో సమస్యలు'
సోలాపుర్ సౌత్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించడంపై శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు. ' మా పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే అమర్ పాటిల్ పేరును ప్రకటించాం. అయినా సోలాపుర్ సౌత్ నియోజకవర్గం నుంచి దిలీప్ మానే బరిలోకి దిగుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో ఈ విధంగా ఉండటం బహుశా టైపింగ్ పొరబాటని నేను అనుకుంటున్నా. మా వైపు నుంచి కూడా అలాంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉండొచ్చు. ఇక సీటు సర్దుబాటులో భాగంగా మిరాజ్ నియోజకవర్గం నుంచి స్థానిక కాంగ్రెస్ నాయకులు పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు నాకు తెలిసింది. ఈ ఆలోచన సరైనది కాదు. మిత్రపక్షాలకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టడం సరికాదు. ఇలాంటి చర్యల వల్లే మహా వికాస్ అఘాడిలో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది' అని సంజయ్ రౌత్ హెచ్చరించారు.
అయితే, సోలాపుర్ సౌత్ స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్లుగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర స్థాయిలో వ్యాఖ్యనించలేమని, కూటమి నేతలో సంజయ్ రౌత్ చర్చించాలని సూచిస్తున్నట్లుగా పేర్కొన్నారు.