Loksabha Election Schedule 2024 :త్వరలో జరగబోయే 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు దాదాపు పూర్తయినట్లు సమాచారం. లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్- ఈసీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తోంది. రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన అధికారులు షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మార్చి 9వ తేదీ తర్వాత ఈసీ పోలింగ్ తేదీలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు జమ్మూకశ్మీర్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ అనుకుంటోంది. దీనికోసం మార్చి 8-9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈ బృందం సమావేశం కానున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు, బలగాలపై ఆ సమావేశాల్లో చర్చించనున్నారు. అనంతరం మార్చి 12-13 తేదీల్లో ఎన్నికల సంఘం బృందం జమ్మూకశ్మీర్‌లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించనుంది. లోక్‌సభతో పాటే స్థానిక అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రానున్నట్లు సమాచారం. ఆ తర్వాత వచ్చే నెల రెండోవారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
మూడు దశల్లో ఎన్నికలు జరపండి : జేడీయూ
ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం సందర్భంగా తాము మూడు సూచనలు చేశామని జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) తెలిపారు. గతంలో మాదిరిగా ఏడు దశల్లో కాకుండా మూడు దశల్లోనే ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు వెల్లడించారు. అంతేకాకుండా బలగాల మోహరింపుపై కూడా పలు సూచనలు చేసినట్లు వెల్లడించారు.