loksabha election 2024 Third Phase :సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడో విడత పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంగళవారం మూడో విడతలో వాస్తవానికి 94 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా, సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవమైంది. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ-అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో రవాణా సమస్యలతో ఆరో విడతకు పోలింగ్ తేదీని మార్చారు. ఫలితంగా మూడో విడతలో 93 సీట్లకే పోలింగ్ జరుగుతోంది. గుజరాత్‌లోని 26 స్థానాలు మూడో విడతలో ఉండగా, సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని నామినేషన్ తిరస్కరణకు గురికావడం, ఇతర అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడం వల్ల అక్కడ బీజేపీ అభ్యర్థి ముకేష్ దలాల్ ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఫలితంగా గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలకే మంగళవారం పోలింగ్ జరగనుంది.
లోక్‌సభ మూడో విడత ఎన్నికలు వివరాలు (ETV BHARAT) - గుజరాత్‌లో 4.97 కోట్ల మంది ఓటర్లు
- 2.56 కోట్ల మంది పురుషులు
- 2.41 కోట్ల మంది మహిళలు
- 1534 మంది థర్డ్ జెండర్ ఓటర్లు
- 50 వేల 788 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసిన ఈసీ
గుజరాత్‌లో 2014, 2019 ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ కమలదళమే విజయం సాధించింది. గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సోనాల్ పటేల్‌ను బరిలోకి దింపింది. ఈ నియోజకవర్గంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఓటరుగా ఉన్నారు. పోర్‌బందర్ నుంచి కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాజ్‌కోట్‌లో మరో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా పోటీ చేస్తున్నారు.
లోక్‌సభ మూడో విడత ఎన్నికలు వివరాలు (ETV BHARAT) బీజేపీ కంచుకోటలో పోలింగ్
కర్ణాటకలో మిగిలిన 14 లోక్‌సభ స్థానాలకు మంగళవారమే మూడో విడతలో పోలింగ్ జరగనుంది. కర్ణాటకలో మొత్తం 28 సీట్లు ఉండగా 14 చోట్ల రెండో విడతలో ఏప్రిల్ 26న పోలింగ్ ముగిసింది. మే 7న మిగిలిన 14 సీట్లలో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. 14 స్థానాల్లో 227 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారిలో 206 మంది పురుషులు, 21 మంది మహిళలు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ణాటకలో పోలింగ్ జరగనుంది. 2.59 కోట్ల మంది ఓటర్లు ఉండగా 28 వేల 269 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ 14 స్థానాలను 2019లో బీజేపీనే కైవసం చేసుకుంది. కర్ణాటకలోని ధార్వాడ నుంచి ఇప్పటికే 3 సార్లు గెలిచిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నాలుగోసారి పోటీ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసూటీతో తలపడుతున్నారు. మరో కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా బీదర్ నుంచి మరోసారి పోటీకి నిలిచారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మై హవేరీ స్థానంలో, జగదీష్ షెట్టార్ బెల్గాంలో అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
మూడో విడతలో కీలక అభ్యర్థులు (ETV BHARAT) కీలక అభ్యర్థులు (ETV BHARAT) బారామతిలో నెగ్గేది ఎవరో?
మహారాష్ట్రలో కీలకమైన 11స్థానాలకు మూడో దశలో మంగళవారం పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ సీట్ల ఉండగా తొలి విడతలో 5, రెండో విడతలో 8 స్థానాలకు పోలింగ్ జరిగింది. మూడో విడతలో పోలింగ్ జరిగే 11 స్థానాలకు 258 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.09 కోట్ల మంది ఓటర్లు ఉండగా 23 వేల 36 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తిరుగుబాట్లతో ముక్కలైన శివసేన, ఎన్సీపీలోని రెండు వర్గాలకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. మరాఠా రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటలాంటి బారామతిలో ఆయన కుమార్తె సుప్రియా సూలేపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ పోటీకి దిగడం వల్ల పోరు రసవత్తరంగా మారింది. సుప్రియా సూలే కొత్త గుర్తుతో పోటీ చేస్తుండటం పోటీని మరింత కఠినంగా మార్చింది. రాజవంశానికి చెందిన షాహు ఛత్రపతి కాంగ్రెస్ అభ్యర్థిగా కొల్హాపూర్ నుంచి మరో రాజవంశస్థుడు ఉదయన్ రాజే భోసలే బీజేపీ అభ్యర్థిగా సతారా నుంచి పోటీలో ఉన్నారు. రత్నగిరి-సింధ్‌దుర్గ్ స్థానంలో కేంద్ర మంత్రి నారాయణ్ రాణె పోటీ చేస్తున్నారు.
లోక్‌సభ మూడో విడత ఎన్నికలు (ETV BHARAT) అభ్యర్థుల విద్య అర్హతల వివరాలు (ETV BHARAT) మూడో విడత పోటీలో ములాయం కుటంబం
ఉత్తర్ ప్రదేశ్‌లోని పది స్థానాలకు మంగళవారం మూడో విడతలోనే పోలింగ్ జరగనుంది. యూపీలోని పది స్థానాలకు 100 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1.88 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. వారిలో పురుషులు కోటి మంది, మహిళలు 87లక్షలు ఉన్నారు. ఈ విడతలో సమాజ్‌వాదీపార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు పోటీలో ఉండడం వల్ల అందరి దృష్టి వారిపైనే ఉంది. మెయిన్‌పురి నుంచి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ మరోసారి పోటీ చేస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ మరణంతో 2022లో జరిగిన ఉపఎన్నికలో డింపుల్ యాదవ్ 2.88 లక్షల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రఘురాజ్‌సింగ్‌పై గెలిచారు. డింపుల్‌పై ఈసారి బీజేపీ యూపీ పర్యటక మంత్రి జయవీర్ సింగ్‌ను నిలిపింది. ఫిరోజాబాద్ నుంచి ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్ యాదవ్ తనయుడు అక్షయ్ యాదవ్ మరోసారి పోటికి దిగారు. బదాయూ లోక్‌సభ స్థానం నుంచి శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ తొలిసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
కోటీశ్వరులైన అభ్యర్థుల వివరాలు (ETV BHARAT) 30ఏళ్ల తర్వాత లోక్‌సభ బరిలో దిగ్విజయ్ సింగ్
మధ్యప్రదేశ్‌లోని తొమ్మిది స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. బెతుల్ లోక్‌సభ స్థానానికి రెండో విడతలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా, అక్కడ BSP అభ్యర్థి మరణంతో మూడో దశకు మారింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 స్థానాలు ఉండగా తొలి రెండు దశల్లో 11 స్థానాలకు పోలింగ్ జరిగింది. మూడో విడతలో 9 స్థానాలకు పోలింగ్ జరగనుండగా 127 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1.77 కోట్ల మంది వారి భవితవ్యం తేల్చనున్నారు. 20 వేల 456 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గుణ నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆయన లక్షకుపైగా ఓట్ల తేడాతో తన రాజకీయ జీవితంలో తొలిసారి ఓటమి పాలయ్యారు. తర్వాత బీజేపీలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. ఒకప్పటి బీజేపీ అగ్రనేత, 2023లోకాంగ్రెస్‌లో చేరిన రావ్ యాదవేంద్ర సింగ్ యాదవ్‌తో సింధియా ఈసారి తలపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నుంచి పోటీ చేస్తున్నారు. రాజ్‌గడ్‌లో కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 30 ఏళ్ల తర్వాత దిగ్విజయ్ సింగ్ లోక్‌సభ బరిలో నిలిచారు.
అభ్యర్థుల వయసు వివరాలు (ETV BHARAT) ఏడు స్థానాలకు పోలింగ్
ఛత్తీస్‌గఢ్‌లోని ఏడు నియోజకవర్గాలకు కూడా మూడో విడతలోనే మంగళవారం పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సుర్గుజా, రాయ్‌గఢ్, జంజ్‌గిర్ చంపా, కోర్బా, బిలాస్‌పుర్, దుర్గ్, రాయ్‌పుర్ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. రాయ్‌పుర్ స్థానంలో రాష్ట్ర మంత్రి బ్రిజ్‌మోహన్ అగర్వాల్‌ను బీజేపీ పోటీకి దింపగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వికాస్ ఉపాధ్యాయ్‌ను రంగంలోకి దించింది. కొర్బా స్థానంలో మాజీ ఎంపీ సరోజ్ పాండేకు బీజేపీ సీటివ్వగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ జోత్స్న మహంత్ మరోసారి పోటీకి నిలిచారు. ఆమె ఛత్తీస్‌గడ్ ప్రతిపక్ష నేత చంద్రదాస్ మహంత్ సతీమణి.
- ఛత్తీస్‌ఢ్‌లోని 7 నియోజకవర్గాలకు మూడో విడతలో పోలింగ్
- ఛత్తీస్‌గఢ్‌లోని 11నియోజకవర్గాల్లో ఇప్పటికే 4 చోట్ల పోలింగ్ పూర్తి
- 7 స్థానాల్లో 168 మంది అభ్యర్థుల పోటీ
- 15,701 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఈసీ
బిహార్‌లో 5, అసోంలో 4 స్థానాలకు పోలింగ్
బిహార్‌లోని ఐదు స్థానాలకు కూడా మే 7నే పోలింగ్ జరగనుంది. ఝంఝర్‌పూర్, సుపాల్, అరారియా, మాధేపురా, ఖగారియా లోక్‌సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ కోసం ఈసీ ఏర్పాట్లు పూర్తిచేసింది. 5స్థానాల్లో 54మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అసోంలోని 4 స్థానాలకు మూడో విడతలో పోలింగ్ జరగనుంది. ధుబ్రి, కోక్రాఝర్, బార్పేట, గువాహటి స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 4 స్థానాలకు 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 80 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యం తేల్చనున్నారు. మంగళవారం జరిగే ఎన్నికలతో అసోంలోని మొత్తం 14 స్థానాలకు ఓటింగ్ పూర్తవ్వనుంది. అసోంలోని ధుబరీ నుంచి ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ పోటీ చేస్తున్నారు. 2009 నుంచి ఇక్కడ గెలుస్తున్న బద్రుద్దీన్‌కు ఈ ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తోంది. డీలిమిటేషన్‌లో భాగంగా ముస్లింలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలను వేరే పార్లమెంట్ స్థానంలో కలపడం వల్ల ఈసారి ఆయనకు గట్టి సవాలు ఎదురవుతోంది. కానీ క్షేత్రస్థాయిలో బద్రుద్దీన్‌కు మంచిపేరు ఉండడం కలిసి వచ్చే అంశం.
అభ్యర్థుల నేర చరిత్ర (ETV BHARAT) అభ్యర్థుల నేర చరిత్ర (ETV BHARAT) గోవాలో అత్యంత సంపన్న మహిళ పోటీ
బంగాల్‌లోని 4 లోక్‌సభ స్థానాలకు మంగళవారమే పోలింగ్ జరగనుంది. మాల్దా ఉత్తర్, మల్దా దక్షిణ్, జంగీపుర్, ముర్షీదాబాద్‌లో ఓటింగ్ కోసం సర్వం సిద్ధమైంది. 57 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 73 లక్షల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేసేందుకు సిద్ధమయ్యారు. గోవాలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాలైన ఉత్తర గోవా, దక్షిణ గోవా స్థానాలకు ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. గోవాలోని ప్రముఖ పారిశ్రామిక కుటుంబం నుంచి వచ్చిన పల్లవి డెంపో దక్షిణ గోవా నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. రూ.1361 కోట్ల ఆస్తులున్న ఆమె మూడో విడతలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. గోవాలో తొలిసారిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మహిళగా డెంపో నిలిచారు. 2019లో దక్షిణ గోవాలో కాంగ్రెస్ నుంచి ఫ్రాన్సిస్కో సర్దిన్హా 9 వేల 755 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి ఎలాగైనా అక్కడ గెలవాలని పల్లవిని బీజేపీ బరిలోకి దింపింది. కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, డామన్‌డయ్యులో రెండు స్థానాలకు మంగళవారమే ఓటింగ్ జరగనుంది.
కోటీశ్వరులైన అభ్యర్థుల వివరాలు (ETV BHARAT)