Lok Sabha Polls 2024 Nominations Today: లోక్‌సభ ఎన్నికల రెండో విడత బరిలో ఉన్న పలువురు ప్రముఖులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. కర్ణాటకలోని మండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి గురువారం నామినేషన్ వేశారు. మాజీ సీఎం, బీజేపీ నేత యడియూరప్ప, గోవా సీఎం ప్రమోద్ సావంత్, మైసూర్ రాజవంశానికి చెందిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ వెంటరాగా కుమారస్వామి నామినేషన్ వేశారు.
నటి సుమలత మద్దతుతో!
గత ఏడాది సెప్టెంబర్‌లో కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు కుదిరింది. కర్ణాటకలో ఉన్న 28 లోక్‌సభ స్థానాల్లో 3 సీట్లను పొత్తులో భాగంగా జేడీఎస్‌కు బీజేపీ కేటాయించింది. మండ్య నియోజకవర్గంలో గతంలో సినీ నటి సుమలత బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అయితే ఇప్పుడు బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన సుమలత, మండ్యలో కుమారస్వామికి మద్దతు ఇచ్చారు.
కేంద్రమంత్రి నామినేషన్‌కు వేళాయే!
కేరళలో ఎన్డీఏ అభ్యర్థి, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్‌కు నామ పత్రాలు సమర్పించారు. విదేశాంగ మంత్రి జైశంకర్ సహా ఇతర బీజేపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నామినేషన్ దాఖలుకు ముందు తిరువనంతపురంలో భారీ రోడ్‌షోను రాజీవ్ చంద్రశేఖర్ నిర్వహించారు. తిరువనంతపురం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత సిట్టింగ్ ఎంపీ శశిథరూర్, సీపీఐ వెటరన్ పన్నియన్ రవీంద్రన్‌తో రాజీవ్ చంద్రశేఖర్ తలపడుతున్నారు. శశిథరూర్ ఇప్పటికే తిరువనంతపురంలో నామినేషన్ వేశారు.