Lifetime Pani Puri Offers :వ్యాపారంలో పోటీని తట్టుకోవాలంటే వినూత్నంగా ఆలోచించడం సహా వినియోగదారులను ఆకట్టుకునే తెలివితేటలు ఉండాలి. సరిగ్గా అదే చేస్తున్నాడు మహారాష్ట్రలో ఆరెంజ్ సిటీగా పేరుపొందిన నాగ్‌పుర్‌కు చెందిన చిరువ్యాపారి. పానీపూరి తయారీలో, రెసిపీలో కొత్తదనం లేకున్నా వినూత్నమైన ఆఫర్లను ప్రకటించి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాడు. ప్రస్తుతం నాగ్‌పుర్‌లో విజయ్ మెవాలాల్ గుప్తా ఔట్‌లెట్ చర్చనీయాంశంగా మారింది. రూ.99వేలు చెల్లిస్తే జీవిత కాలం ఎన్ని పానీపూరీలైనా తినొచ్చని విజయ్ మెవాలాల్ చెబుతున్నాడు. ఇప్పటికే ఇద్దరు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకున్నారని తెలిపాడు. ద్రవ్యోల్బణం, ఏటా పానిపూరీల మీద పెట్టే ఖర్చుతో పోలిస్తే ఈ ఆఫర్ చాలా చవకని చెబుతున్నాడు.
"రూ.99 వేల ఆఫర్‌పై స్పందన చాలా బాగుంది. నాగ్‌పుర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ ఆఫర్‌ను ఎంచుకున్నారు. రెండు, మూడు నెలల నుంచి కూడా చాలా మంది ఈ ఆఫర్ గురించి వాకబు చేస్తున్నారు. రోజుకు గోల్‌గప్పా మీద రూ. 100 ఖర్చు పెడితే నెలకు రూ.3వేలు, ఏడాదికి రూ.36వేలు ఖర్చవుతుంది. 10ఏళ్లలో రూ.3 లక్షల 60వేలవుతుంది. కానీ మేము రూ.99వేలకే జీవిత కాలం తినేలా ఆఫర్‌ను ప్రకటించాం. ఈ ఆఫర్‌ను కస్టమర్లు ఇష్టపడుతున్నారు. తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు."
--విజయ్ మెవాలాల్ గుప్తా, చిరువ్యాపారి
మహారాష్ట్రలో మహిళలకు ఆర్థిక సాయం చేసేందుకు ప్రవేశపెట్టిన లాడ్‌లీ బహనా యోజన, మహాకుంభమేళా పేరిట కూడా ఆఫర్లు పెట్టాడు. లాడ్‌లీ బహనా యోజన లబ్ధిదారులు 60 రూపాయలు చెల్లించి ఎన్ని గోల్‌గప్పాలైనా లాగించవచ్చు. మాహాకుంభమేళా కింద రూపాయికే 40 పానిపూరీలు తినొచ్చు. అయితే ఒకేసారి 40 గోల్‌గప్పాలు తినాలనే అతడు షరతు పెట్టాడు. 195 రూపాయలు చెల్లించి నెల పాటు ఎన్ని పానిపూరీలైనా తినొచ్చని మరో ఆఫర్ ప్రకటించాడు. ఈ ఆఫర్లు తనను ఫేమస్ చేయడం సహా వ్యాపారాన్ని పుంజుకునేలా చేశాయని విజయ్ మెవాలాల్ చెబుతున్నాడు. సామాజిక మాధ్యమాల్లో చూసి ఇక్కడకు వచ్చామని కస్టమర్లు చెబుతున్నారు.