Leap Year Interesting Facts :ఏటా ఫిబ్రవరి 28వ తేదీతో ముగుస్తుంది. కానీ ఈ ఏడాది 29వ తేదీతో ముగియనుంది. ఒకరోజు అదనంగా వచ్చింది. ప్రతి నాలుగేళ్లకోసారి ఇలా జరుగుతుందని అందరికీ తెలుసు. దీనికి కారణం లీపు సంవత్సరం. అయితే అసలు ఈ లీపు సంవత్సరం అంటే ఏంటి? అది నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఎందుకు వస్తుంది? ఈ లీపు ఇయర్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.
లీప్ ఇయర్ అనేది మన సాధారణ సంవత్సరంతో పోలిస్తే, అదనపు రోజు ఉన్న క్యాలెండర్ సంవత్సరం. సాధారణంగా ఏడాదికి 365 రోజులుంటాయి. కానీ లీపు సంవత్సరంలో ఒకరోజు అదనంగా అంటే 366 రోజులుంటాయి. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి నాలుగేళ్లకోసారి ఈ లీపు సంవత్సరం వస్తుంది. అప్పుడు ఫిబ్రవరిలో 29వ తేదీ కూడా ఉంటుంది. నాలుగుతో విభజితమయ్యే ప్రతి సంవత్సరం ఈ లీపు ఇయర్ అవుతుంది. ఉదాహరణకు 2020, 2024. అలాగే 1900 లేదా 00 తో ముగిసే సంవత్సరాలకు లీపు రాదు. తర్వాతి లీప్ ఇయర్స్ 2028, 2032,2036 సంవత్సరాల్లో వస్తాయి.
ఇతర క్యాలెండర్లలో లీపు సంవత్సరాలు!
హిబ్రూ, ఇస్లామిక్, చైనీస్, ఇథియోపియన్ క్యాలెండర్లు సహా ఇతర క్యాలెండర్లు కూడా లీపు సంవత్సరాల్ని కలిగి ఉన్నాయి. అయితే ఇవి ప్రతి నాలుగేళ్లకోసారి రావు. కొన్నింటిల్లో తక్కువ వ్యవధితో, మరికొన్ని ఒకటి కంటే ఎక్కువ లీప్ రోజుల్ని కలిగి ఉంటాయి. లీప్ ఇయర్స్, లీప్ డేస్‌తో పాటు గ్రెగోరియన్ క్యాలెండర్లో కొన్ని లీప్ సెకన్లు కూడా ఉన్నాయి.
మనకు లీపు సంవత్సరాలు ఎందుకు అవసరం?
మనకు నిజంగా ఈ లీపు సంవత్సరాలు అవసరమా అని అనిపించవచ్చు. కానీ ఇవి చాలా ముఖ్యమైనవి. సోలార్ ఇయర్లో 5 గంటల 48 నిమిషాల 56 సెకన్లు సమయం ఎక్కువగా ఉంటుంది. అంటే దాదాపు 365.24 రోజులు. ఇది ఇలాగే కొనసాగితే కాలక్రమేణా సీజన్లు మారతాయి. ఉదాహరణకు 700 సంవత్సరాల తర్వాత వేసవి కాలం జూన్‌కు బదులుగా డిసెంబర్లో ప్రారంభమవుతుందని నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం తెలిపింది. అందుకే ప్రతి నాలుగేళ్లకోసారి లీప్ డేను జోడించడం వల్ల ఈ సమస్య తలెత్తకుండా ఉంటుంది.