Lalu Prasad Yadav ED :బిహార్లో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరిన మరుసటి రోజే ఆసక్తికర పరిణామం జరిగింది. ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఈడీ విచారణకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ హాజరయ్యారు. పట్నాలోని ఈడీ కార్యాలయానికి లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమార్తె మిసా భారతితో కలిసి వచ్చారు. ఆ సమయంలో ఈడీ కార్యాలయానికి ఆర్జేడీ కార్యకర్తలు, లాలూ మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. లాలూకు అనుకూలంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.
లాలూ ప్రసాద్ యాదవ్ విచారణ నిమిత్తం ఈడీ ఎదుట హాజరుకావడంపై ఆయన కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి మీడియాతో మాట్లాడారు. 'ఇది కొత్త విషయం కాదు. తమతో(బీజేపీని ఉద్దేశించి) రాని వారికి ఈ శుభాకాంక్షల కార్డు పంపుతోంది. ఏదైనా ఏజెన్సీ మా కుటుంబాన్ని పిలిచినప్పుడల్లా మేము అక్కడికి వెళ్లి వారికి సహకరిస్తాం. వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తాం." అని తెలిపారు.
కేసు ఏంటంటే?
Land For Job Scam Bihar :భూములు తీసుకుని బదులుగా రైల్వే ఉద్యోగాలు కట్టబెట్టారన్న ఆరోపణలతో లాలూ, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు మనీ లాండరింగ్ కేసులో ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ పట్నా కార్యాలయంలో ఈడీ విచారణకు సోమవారం హాజరయ్యారు.