India Indonesia Bilateral Talks : రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని భారత్, ఇండోనేసియా నిర్ణయించుకున్నాయని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ, పంపిణీ విభాగాల్లో ఇరుదేశాలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయని ఆయన వెల్లడించారు. ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో భేటీ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు.
"భారతదేశ తొలి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియానే ముఖ్య అతిథి. ఈసారి 75వ గణతంత్ర దినోత్సవానికి కూడా ఆ దేశమే ముఖ్య అతిథిగా హాజరవుతుండటం గర్వకారణం. ఇది ఒక చారిత్రక ఘట్టం. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను నేను భారత్‌లోకి స్వాగతం పలుకుతున్నా" అని ఆయన పేర్కొన్నారు. పరస్పర సహకార భావనపై తామిద్దరం సమావేశంలో చర్చించినట్లు మోదీ తెలిపారు.
"ఆసియాన్ కూటమిలో భారత్‌కు కీలకమైన మిత్రదేశం ఇండోనేసియా. ఇండో పసిఫిక్ ప్రాంతంలోనూ ఇండోనేషియాకు భారత్ చాలా ప్రాధాన్యతను ఇస్తుంది. ఆ సముద్ర జలాల్లో అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అన్నిదేశాల నౌకల రాకపోకలు జరగాలనేది ఇరుదేశాల అభిమతం" అని భారత ప్రధాని చెప్పారు. చైనాను ఉద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ కూటమిలోకి ఇండోనేసియా చేరికకు భారత్ మద్దతు తప్పకుండా ఉంటుందన్నారు.
"ప్రంబానన్ హిందూ ఆలయ పరిరక్షణకు సాయం చేస్తాం. సముద్ర జలాల్లో భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఉగ్రవాదాన్ని నిరోధించడం, తీవ్రవాద సంస్థలను నిర్వీర్యం చేయడం, నేర దర్యాప్తు, రెస్క్యూ విభాగాల్లో నైపుణ్యాల పెంపు వంటి అంశాలపై భారత్, ఇండోనేషియా పరస్పర సహకారాన్ని అందించుకోనున్నాయి. వీటికి సంబంధించిన ఒప్పందాలపై ఈరోజు సంతకాలు జరిగాయి" అని భారత ప్రధాని ప్రకటించారు. రెండు దేశాలకు చెందిన విపత్తు నిర్వహణ విభాగాలు కలిసి అభ్యసన విన్యాసాలు చేస్తాయన్నారు.
"గత కొన్నేళ్లలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం గణనీయంగా పెరిగింది. గతేడాది అది 30 బిలియన్ డాలర్లను దాటింది" అని ఆయన చెప్పారు. "ఫిన్ టెక్, ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి విభాగాల్లో భారత్, ఇండోనేషియా సహకరించుకుంటాయి. వైద్యం, ఆహార భద్రతా రంగాలకు సంబంధించిన ఆధునిక సాంకేతికతను ఇండోనేషియాకు భారత్ అందిస్తోంది" అని మోదీ తెలిపారు.
"ఇండోనేషియాలోని బోరోబుదుర్‌లో బౌద్ధ దేవాలయం ఉంది. అక్కడున్న ప్రంబానన్ హిందూ ఆలయం పరిరక్షణకు కూడా భారత్ సహాయాన్ని అందిస్తుంది" అని ప్రధాని వెల్లడించారు. దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆదివారం రోజు దిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రబోవో సుబియాంటో హాజరవుతారు.