Lalu Prasad Yadav ED Case : బిహార్‌లో జరిగిన 'ల్యాండ్ ఫర్ జాబ్' మనీలాండరింగ్ కుంభకోణంలో విచారణకు హాజరైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను సుదీర్ఘంగా విచారించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ). సుమారు 9గంటలకుపైగా ప్రశ్నించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు, లాలూ ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.
విచారణ కోసం సోమవారం ఉదయం 11:00 గంటల ప్రాంతంలో పట్నాలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న లాలూ రాత్రి 8:50 గంటలకు బయటకు వచ్చారు. ఈ సమయంలో ఆయనతో కుమార్తె మిసా భారతి కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్న లాలూకు మద్దతుగా భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. అయితే ఆదివారం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన మరుసటిరోజే ఈ పరిణామం జరగడం వల్ల అక్కడి రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా నిలిచాయి.
ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి
'లాలూ ప్రసాద్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయణ్ను ఇన్ని గంటలపాటు విచారించకుండా ఉండాల్సింది. ఇది ఆయన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు' అని ఆర్జేడీ నేత లలిత్ యాదవ్ అన్నారు. మరోవైపు ఈడీ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వం చేప్పినట్లుగా వ్యవహరిస్తోందని, ఈడీ అనేది ప్రస్తుతం ఒక జోక్‌గా మారిందని ఆర్జేడీ మహిళానేత ఎజ్యా యాదవ్ మండిపడ్డారు. అయితే ఈడీ సొంతంగా పనిచేస్తే లాలూపై ఇలాంటి ఆరోపణలు వచ్చేవి కాదని ఆమె వ్యాఖ్యానించారు.
"లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇటీవలే ఆపరేషన్ జరిగింది. అయినాసరే ఆరోగ్య సమస్యలున్న వ్యక్తిని ఇన్ని గంటలపాటు విచారించడం సరికాదు. ఇది ముమ్మాటికి ఆయణ్ను వేధించడమే."
- ఎజ్యా యాదవ్, ఆర్జేడీ నాయకురాలు