Kolkata Doctor Death :కోల్‌కతాలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య తర్వాత నిందితుడు లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న పోలీసులు తుది పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు వైద్యురాలిపై ఘాతుకానికి పాల్పడిన నిందితుడికి, ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయినట్లు తేలింది.
కోల్‌కతాలోని ఆర్జీ కార్ ప్రభుత్వాసుపత్రిలో, జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో దోషిని కఠినంగా శిక్షించాలని పెద్దఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వైద్య విద్యార్థుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఘటన జరిగిన ఆర్జీ కార్ ప్రభుత్వాసుపత్రిలో వరుసగా మూడో రోజు విధులు బహిష్కరించిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ ధర్నా నిర్వహించారు.
హాలులో నిద్రిస్తున్న డాక్టర్‌పై హత్యాచారం!
మరోవైపు హత్యాచార ఘటనలో తుది పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో వైద్యురాలపై లైంగిక దాడి జరిగిందని తేలిందని, ఆమె రహస్య అవయవాల నుంచి బ్లీడింగ్ అయినట్లు వెల్లడైందని అన్నారు. ఇతర శరీర భాగాలపైనా గాయాలు ఉన్నట్లు తేలిందని, అయితే, హత్య తర్వాతే లైంగిక దాడి జరిగినట్లు అక్కడి పరిస్థితులను బట్టి అర్థమవుతోందని కొందరు పోలీసులు భావిస్తున్నారు. ఆసుపత్రిలోని కాన్ఫరెన్స్ హాలులో ఒంటరిగా నిద్రిస్తున్న వైద్యురాలిపై నిందితుడు హత్యాచారానికి ఒడిగట్టాడని అంచనా వేస్తున్నారు.