King Vs Queen In Mandi Lok Sabha Seat : హిమాచల్‌ప్రదేశ్ మండి లోక్ సభ స్థానంలో ఆసక్తికర పోరు జరగనుంది. 'కింగ్' వర్సెస్ 'రీల్ క్వీన్' తలపడుతున్నారు. బీజేపీ తరఫున బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలో ఉండగా, హస్తం పార్టీ నుంచి రాజ కుటుంబానికి చెందిన విక్రమాదిత్య సింగ్‌ను బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం విక్రమాదిత్య సింగ్ హిమాచల్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్, హిమాచల్ పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్ దంపతుల తనయుడైన విక్రమాదిత్య ఇప్పటికే రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఈసారి మండిలో యువనేతనే రంగంలో దించాలని సీనియర్ నేతలు భావించడం వల్ల ఆయన పేరు ఖరారైంది.
ఇప్పటి వరకు రాజకటుంబాలదే హవా
ఇప్పటివరకు మండి నియోజకవర్గంలో రాజకుటుంబాలదే హవా. 1952 నుంచి రెండు ఉపఎన్నికలు సహా మొత్తం 19 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 13సార్లు రాజకుటుంబాలకు చెందినవారే గెలుపొందారు. సిమ్లా రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విక్రమాదిత్య సింగ్‌కు మండి పార్లమెంటరీ నియోజకవర్గం కొత్తేమీ కాదు. విక్రమాదిత్య సింగ్ తండ్రి వీరభద్రసింగ్, ప్రతిభాసింగ్ ఇదే నియోజకవర్గంలో ఒక్కొక్కరు మూడు సార్లు గెలుపొందారు. 2021లో మండి లోక్‌సభకు జరిగిన ఉపఎన్నికల్లో తన తల్లి ప్రతిభా సింగ్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో నియోజకవర్గ నాయకులతో విక్రమాదిత్యకు మంచి సంబంధాలు ఉన్నాయి.
ఒకరిపై ఒకరు విమర్శలు
తన అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం ప్రకటించకముందే కంగనా రనౌత్‌పై విక్రమాదిత్య సింగ్ విమర్శలు గుప్పించారు. కంగనాను వివాదాల రాణిగా అభివర్ణించారు. 'కంగనాకు బుద్ధి ప్రసాదించాలని రాముడిని ప్రార్థిస్తున్నా. హిమాచల్ ప్రజల గురించి ఏమాత్రం తెలియని ఆమె మళ్లీ బాలీవుడ్‌కు వెళ్తుందని ఆశిస్తున్నా' అని విమర్శించారు. విక్రమాదిత్య సింగ్‌కు కౌంటర్ వేశారు కంగనా రనౌత్. 'హిమాచల్ విక్రమాదిత్య తాతల జాగీరేమీ కాదు. నన్ను బెదిరించి వెనక్కి పంపలేరు. రాహుల్, విక్రమాదిత్య ఇద్దరూ పప్పూలే. హిమాచల్‌లోని ఛోటా పప్పు నేను గోమాంసం తింటానని అంటున్నారు. అయితే నేను గోమాంసం తిన్నట్లు ఆధారాలు ఎందుకు చూపడం లేదు. అబద్దాలు చెప్పడంలో విక్రమాదిత్య సింగ్ నెంబరు 1గా ఉన్నారు. తల్లిదండ్రుల సాయం లేకుండానే సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకున్నాను. రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఉంది.' అని కంగానా రనౌత్ అన్నారు.