Khelo India Winners Government Jobs : అన్ని రకాల ఖేలో ఇండియా పోటీల విజేతలు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా తెలిపారు. భారత్‌ను స్పోర్టింగ్ సూపర్ పవర్‌గా మార్చడంలో ఈ కొత్త అవకాశం గణనీయమైన పురోగతిని సూచిస్తుందని ఆయన చెప్పారు.
క్రీడా మంత్రిత్వ శాఖ, శిక్షణ విభాగంతో సంప్రదించి ప్రభుత్వ ఉద్యోగాలను కోరుకునే క్రీడాకారుల అర్హత ప్రమాణాలకు సవరణలు చేశామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ తెలిపారు. ఖేలో ఇండియాతో పాటు యూనివర్శిటీ, పారా, వింటర్ గేమ్స్ పతక విజేతలను ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటించారు. 'భారత్‌ను క్రీడల్లో గణనీయమైన మార్పును తీసుకురావడం కోసం ఈ సవరణలు ఉపయోగపడతాయి. అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రతిభను పెంపొందించేందుకు, అలానే మంచి కెరీర్‌గా ఎంపిక చేసుకునేందుకు ఈ మార్పులు చేశాం' అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ చెప్పారు.
అట్టడుగు స్థాయిలో క్రీడా సంస్కృతిని పునరుజ్జీవింపజేసేందుకు మోదీ ప్రభుత్వం ఖేలో ఇండియా క్రీడలను తొలిసారిగా 2018లో నిర్వహించింది. ఇటీవలే తమిళనాడులో ఖేలో ఇండియా-2023 పోటీలు జరిగాయి. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జనవరి 19వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ హాజరై ప్రారంభించారు. ఆ సమయంలో దేశ నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు.
2029లో యూత్ ఒలింపిక్స్, 2036లో ఒలింపిక్స్ పోటీల్ని భారత్‌లో నిర్వహించేందుకు ఎంతో పట్టుదలతో ఉన్నట్లు వివరించారు. 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్ క్రీడల్లో ఎక్కువ పతకాలు సాధించే లక్ష్యంతో సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. దశాబ్దకాలంలో క్రీడల్లో సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. బీచ్‌గేమ్స్, క్రీడా పర్యాటక అధ్యాయం భారత్‌లో మొదలైందని, తీర ప్రాంతాలకు ఎంతో మేలుచేసేలా ప్రణాళికలు చేశామని వెల్లడించారు.
చెన్నై, మదురై, తిరుచ్చి, కోవై నగరాల్లో ఖేలో ఇండియా పోటీలు జనవరి 31వ తేదీన వరకు జరిగాయి. ఈ పోటీల్లో దేశ నలుమూలల నుంచి వచ్చిన 5600 మంది అథ్లెట్లు పోటీపడ్డారు. 57 స్వర్ణాలు, 48 రజతాలు, 53 కాంస్య పతకాలతో మహరాష్ట్ర అగ్రస్థానంలో నిలిచి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ టైటిల్‌ను దక్కించుకుంది. ఇప్పటి వరకు నాలుగు సార్లు పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆతిథ్యమిచ్చిన తమిళనాడు 38 స్వర్ణాలు, 21 రజతాలు, 39 కాంస్యాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే రెండుసార్లు టైటిళ్లను గెలుచుకున్న హరియాణా 35 స్వర్ణాలు, 22 రజతాలు, 46 కాంస్య పతకాలతో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది ఖేలో ఇండియా పోటీల్లో స్క్వాష్ గేమ్ చేర్చారు నిర్వాహకులు.