Kejriwal Health Controversy :దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అరెస్టు చేసినప్పటి నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ బరువు నాలుగున్నర కేజీలు తగ్గిందంటూ మంత్రి అతిశీ చేసిన ఆరోపణలపై తిహాడ్ జైలు అధికారులు స్పందించారు. జైలులోకి వచ్చినప్పుడు కేజ్రీవాల్ బరువు ఎంతుందో, ఇప్పుడూ అంతే ఉందని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1వ తేదీన సాయంత్రం జైలులోకి వచ్చిన సమయంలో కేజ్రీవాల్ బరువు దాదాపు 65 కిలోలు ఉండగా, ఇప్పుడూ అంతే ఉందని తేల్చి చెప్పారు. "తిహాడ్ జైలుకు కేజ్రీవాల్‌ను తీసుకురాగానే ఇద్దరు వైద్యులు ఆయన్ను పరీక్షించారు. ఆయన ఆరోగ్య స్థితిగతులన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. గత రెండు రోజుల్లో కేజ్రీవాల్ బరువు ఏ మాత్రం తగ్గలేదు. కోర్టు ఆదేశాల మేరకు ఇంట్లో వండిన ఆహారాన్నే ఆయనకు అందిస్తున్నాం" అని పేర్కొంటూ తిహాడ్ జైలు ఉన్నతాధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
69.5 కేజీల నుంచి 65 కేజీలకు తగ్గారు : అతిశీ
అంతకుముందు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి అతిశీ. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలోకి తీసుకున్న సమయంలో సీఎం కేజ్రీవాల్ బరువు 69.5 కేజీలని, ఆయన జైల్లోకి వెళ్లే సమయానికి అది 65 కేజీలకు తగ్గిందని అన్నారు. మొత్తం మీద గత 12 రోజుల్లో కేజ్రీవాల్ నాలుగున్నర కేజీల బరువు తగ్గారని తెలిపారు. ఆయన ఆరోగ్యంతో బీజేపీ చెలగాటం ఆడుతోందని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే యావత్ దేశం, దేవుడు బీజేపీని క్షమించవని ఆమె వ్యాఖ్యానించారు. తీవ్రమైన షుగర్‌తో బాధపడుతున్న కేజ్రీవాల్, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా దేశం కోసం అహర్నిశలు శ్రమించారని చెప్పారు. ఆయనను ఇబ్బందికి గురిచేయడం సరికాదన్నారు.