Kejriwal ED Summons :దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీచేసింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈనెల 26న తమ ముందు విచారణకు హాజరుకావాలని కోరింది. ఇప్పటి వరకు కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీచేయడం ఇది ఏడోసారి. స్థానిక కోర్టులో ఈ అంశం ఉన్నందున తాజాగా సమన్లు జారీచేయడం చట్టవిరుద్దమని కేజ్రీవాల్ చేస్తున్న వాదనలను ఈడీ తోసిపుచ్చింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఫిబ్రవరి 26న తమ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.
ఆమ్ ఆద్మీ అధినేత, ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ తమ సమన్లు పాటించడంలేదని దిల్లీ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవల ఈ కేసు విచారణకు రాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ప్రత్యక్ష హాజరు నుంచి కేజ్రివాల్ మినహాయింపు పొందారు. దిల్లీ కోర్టు ఈ కేసు తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఈ కేసులో నిందితులపై విచారణకు తగిన కారణాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది.
అయితే ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటులో కేజ్రీవాల్ పేరును పలుమార్లు ప్రస్తావించింది. గోవా ఎన్నికల సమయంలో రూ.45 కోట్ల అక్రమ ఆదాయాన్ని ఆప్ ఉపయోగించిందని ఛార్జ్షీటులో పేర్కొంది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనకు సంబంధించి నిందితులు కేజ్రీవాల్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలిపింది.