Kejriwal CBI Arrest : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తానేం తప్పు చేయలేదని కోర్టుకు తెలిపారు. తన పార్టీ, మనీశ్ సిసోదియా కూడా తప్పు చేయలేదని చెప్పారు. తిహాడ్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను బుధవారం కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు, అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆ సమయంలో కేజ్రీవాల్ పలు వ్యాఖ్యలు చేశారు. మనీశ్ సిసోదియాకు వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేశానని సీబీఐ చెబుతోందని, అందులో నిజం లేదని చెప్పారు.
అనంతరం సీఎం కేజ్రీవాల్‌ను అధికారికంగా అరెస్టు చేశామని, అవసరమైన అన్ని పత్రాలను సమకూర్చామని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఆయనను 5 రోజుల కస్టడీకి కోరుతూ సీబీఐ చేసుకున్న దరఖాస్తుపై రిజర్వ్ చేసిన తీర్పును బుధవారం సాయంత్రం వెలువరించింది కోర్టు. కేజ్రీవాల్‌ను మూడు రోజుల రిమాండ్‌కు పంపింది. అయితే సీబీఐ అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ తగ్గినట్లు గుర్తించారు. వెంటనే ఆయనకు టీ, బిస్కెట్స్ అందించారు. ఆ సమయంలో కేజ్రీవాల్‌తోపాటు ఆయన సతీమణి సునీత కూడా ఉన్నారు.
బెయిల్ వస్తుందన్న భయంతో!
మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నందున, బీజేపీ భయాందోళనకు గురైందని ఆమ్ఆద్మీ పార్టీ విమర్శించింది. అందుకే ఫేక్ కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ ద్వారా అరెస్ట్ చేయించిందని ఆరోపించింది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. "కేజ్రీవాల్‌ను సీబీఐ కోర్టుకు తీసుకువెళ్లింది. అక్కడ ఆయన చక్కెర స్థాయిలు పడిపోయాయి. మీరు ఎంత అణచివేతకు గురిచేసినా కేజ్రీవాల్ తల వంచరు" అని ఆప్ పేర్కొంది. కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు రాకుండా మొత్తం వ్యవస్థ అంతా ప్రయత్నిస్తోందని ఆయన సతీమణి సునీత ఆరోపించారు.
సీబీఐ అరెస్ట్ చేయక తప్పదు!
మరోవైపు, కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేయక తప్పదని దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా వ్యాఖ్యానించారు. ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్ అని కోర్టుకు సమర్పించిన పత్రాలు నిర్ధరించాయని ఆరోపించారు. ఆయన పర్యవేక్షణలో మద్యం పాలసీ రూపొందిందని, దాని వెనుక పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేశారు. బుధవారం ఉదయం కోర్టు అనుమతితో తిహాడ్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకుని సీబీఐ అరెస్ట్ చేసింది.