Katchatheevu Issue 2024 Loksabha Elections : సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పుడల్లా తమిళనాడులో రాజకీయ పార్టీలకు గుర్తొచ్చే అంశం కచ్చతీవు. బీజేపీ తమిళనాడులో పట్టు పెంచుకోవడానికి తీవ్ర యత్నాలు చేస్తున్న సమయంలో కచ్చతీవు దీవి అంశాన్ని కూడా ప్రధాన ఆయుధంగా ఎంచుకుంది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. భారత్‌కు చెందిన కచ్చతీవు దీవిని 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించగా ఈ అంశాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించినట్లు చెప్పిన అన్నామలై తాజా రాజకీయ దుమారాన్ని రేపారు.
భారత మత్స్యకారులకు ప్రవేశం ఉంది!
తమిళనాడు రామేశ్వరం సమీపంలోని భారత్-శ్రీలంక మధ్య ఉన్న చిరు ద్వీపమే కచ్చతీవు. ఇది రామేశ్వరానికి 19 కిలోమీటర్లు శ్రీలంకలోని జాఫ్నాకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాదాపు 285 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూభాగం ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకే మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించారు. దీనిని తమిళ నేతలు ఏమాత్రం ఆమోదించలేదు. శాసనసభలో తీర్మానం, సుప్రీంకోర్టులో కేసులు వేశారు.
వాస్తవానికి ఇది చాలా చిన్నదీవి. ఎవరూ ఉండరు. అయితే దీని పరిధిలో మత్స్య సంపద ఎక్కువగా ఉండడం వల్ల భారత మత్స్యకారులు ఇక్కడ వేట ఎక్కువగా సాగిస్తుంటారు. శ్రీలంక, ఈ దీవి తమది అనే నెపంతో భారత మత్స్యకారులపై దాడులు చేయడం సహా అరెస్టులు చేస్తోంది. ఈ దీవిలో భారత్ మత్స్యకారులకు ప్రవేశం ఉందని ఒప్పందం స్పష్టం చేస్తున్నప్పటికీ శ్రీలంక ఖాతరు చేయడం లేదు. కచ్చతీవు దీవిలో సెయింట్ ఆంటోనీ అనే ప్రార్థనామందిరం ఉంది. ఏటా జరిగే ఉత్సవాల్లో తమిళనాడు వాసులు ఎక్కువగా పాల్గొంటారు.
అలా ఇచ్చేయడం చెల్లదు!
న్యాయపరంగా చూస్తే కచ్చతీవు దీవిని శ్రీలంకు అప్పగించడం చెల్లదని తమిళనాడు పక్షాలు వాదిస్తున్నాయి. భారత రాజ్యాంగ ప్రకారం మన భూభాగాన్ని ఇతర దేశాలకు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. 1958లో భారత్-తూర్పు పాకిస్థాన్ మధ్య బెరుబరి ప్రాంతం వివాదంగా ఉండేది. దానిపై అప్పటి ప్రధాని నెహ్రూ, తూర్పు పాకిస్థాన్ గవర్నర్ ఫిరోజ్‌ఖాన్ మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బెరుబరిలోని కొంత ప్రాంతాన్ని తూర్పు పాకిస్థాన్‌కు ఇచ్చారు. దీనిపై వివాదం చెలరేగడం వల్ల సుప్రీం కోర్టుకు చేరింది. మన దేశానికి చెందిన ప్రాంతాలను ఇతర దేశాలకు ఇవ్వడం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫలితంగా 1960లో రాజ్యాంగ సవరణ చేసి కొంత ప్రాంతాన్ని తూర్పు పాకిస్థాన్‌కు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కచ్చ తీవుపై రాజ్యాంగ సవరణ చేయకుండా శ్రీలంకకు ఎలా అప్పగిస్తారని తమిళ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.
ప్రతి ఎన్నికల్లో కచ్చతీవు పర్వం!
1974 తర్వాత తమిళనాడులో ప్రతీ ఎన్నికల్లో ఇదే కీలకాంశంగా మారుతోంది. గతంలో కరుణానిధి, జయలలిత మధ్య కూడా ఈ వ్యవహారంపై మాటల యుద్ధం నడిచింది. ఎన్నికల తర్వాత మరుగునపడుతోంది. తమిళ జాలర్లపై శ్రీలంక దళాలు కచ్చతీవు ప్రాంతంలో దాడులకు దిగుతుండటం, లక్షల విలువైన పడవలను ధ్వంసం చేయడం,మత్స్యకారులను బందీలుగా పట్టుకోవడం లాంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతుండగా వీటిని నివారించేందుకు కేంద్రం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తమిళ పార్టీలు కోరుతున్నాయి. వివాదానికి కేంద్ర బిందువు కచ్చతీవు కాబట్టి ఆ దీవిని భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటే తమిళ జాలర్లకు ప్రాణాలకు రక్షణ ఉంటుందని జాలర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.