Karnataka Road Accident :కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. కూరగాయలు, పండ్లతో వెళ్తున్న లారీ లోయలో పడిపోవడం వల్ల ఉత్తర కన్నడ జిల్లాలోని అరబైల్ ఘాట్‌లోని కాగేరి పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం వేకువజామున జరిగిందీ దుర్ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
పండ్లు, కూరగాయలతో హావేరి జిల్లా సవనూరు నుంచి కుంటలోని సంతకు వెళ్తున్న లారీలో 40 మందికి పైగా వ్యాపారులు ఉన్నారు. బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో వెనుక నుంచి వస్తున్న వాహనానికి దారి ఇచ్చేందుకు లారీని ఎడమవైపునకు తిప్పాడు డ్రైవర్. దీంతో లారీ అదుపుతప్పి 50మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. అందులో ఉన్నవారిలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరమణించారు.
రోడ్డు ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన 16 మందిని యల్లాపూర్ తాలూకా ఆస్పత్రికి తరలించారు. అలాగే ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
మృతులు వీరే!
మృతులను ఫయాజ్ ఇమామ్ జమఖండి (45), వసీం (35), ఇజాజ్ ముస్తాకా ముల్లా (20), సాదిక్ భాషా (30), గులామ్ షేన్ జవాలి (40), ఇంతియాజ్ ములకేరి (36), అల్పాజ్ జాఫర్, మందక్కి (25), జిలానీ అబ్దుల్ (25), అస్లాం బెన్ని (24)గా పోలీసులు గుర్తించారు.