Iron Pipe Stuck Lorry Cleaner Chest :ఓ లారీ క్లీనర్ ఛాతీలో ఇరుక్కున్న 90 సెంటీమీటర్ల పొడవైన ఇనుప పైపును విజయవంతంగా తొలగించారు వైద్యులు. అతి క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి ఆ క్లీనర్ ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్బల్లిలో జరిగింది.
ఇదీ జరిగింది
అక్టోబర్ 2న తెల్లవారుజామున రాణేబెన్నూరులోని హుబ్బళ్లి సమీపంలో 4వ నంబర్ జాతీయ రహదారిపై ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్‌గా పని చేస్తున్న జవలమక్కి గ్రామానికి చెందిన దయానంద్ శంకరబాద్గి (27) అనే యువకుడి ఛాతీలోకి రోడ్డు రెయిలింగ్‌పై ఉన్న ఇనుప పైపు చొచ్చుకుపోయింది. స్థానికులు వెంటనే దావణగెరెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్లు లేకపోవడం వల్ల వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. దీంతో దయానంద్‌ను హుబ్బళ్లిలోని కర్ణాటక మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(కేఎంసీఆర్ఐ) అత్యవసర విభాగంలో చేర్పించారు. బాధితుడిని వైద్యులు పరీక్షించి గుండె, ప్రధాన రక్తనాళాలకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. అక్టోబరు 4న సాయంత్రం అత్యవసర శస్త్ర చికిత్సను నిర్వహించారు. దాదాపు రెండు గంటలు శ్రమించి ఇనుప పైపును విజయవంతంగా తొలిగించారు.