Bengal Train Accident: బంగాల్ దార్జిలింగ్‌లో సోమవారం ఓ గూడ్సు రైలు- కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఫన్సీదేవా ప్రాంతంలో పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే బోగీలను పట్టాలపై నుంచి తొలగించారు. ఓ ట్రాక్ నుంచి రైళ్ల రాకపోకలకు అనుమతిస్తున్నారు. మరోవైపు కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ మిగతా బోగీలతో గమ్యస్థానానికి చేరుకుంది. సోమవారం రాత్రి ఏడున్నర గంటలకు సియాదహ్‌కు చేరుకోవాల్సి ఉండగా, ప్రమాదం కారణంగా మంగళవారం వేకువజామున 3గంటలకు చేరుకుంది. 'గత 24 గంటలుగా రైల్వే అధికారులందరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు. సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అయినప్పటికీ వారు రైల్వే లైన్‌ను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నారు. దాదాపు 90 శాతం పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి.' ఈశాన్య సరిహద్దు రైల్వే డీఆర్ఎం సురేంద్ర కుమార్ తెలిపారు.
విచారణ ఆదేశించిన రైల్వేశాఖ
మరోవైపు, బంగాల్లో జరిగిన కాంచన్‌జంగా రైలు ప్రమాదంపై విచారణకు ఆదేశించింది రైల్వే శాఖ. జూన్ 19 ఉదయం 10 గంటల నుంచి ఈశాన్య సరిహద్దు రైల్వే భద్రత ప్రధాన కమిషనర్ జనక్ కుమార్ గార్గ్ నేతృత్వంలో ఈ విచారణ జరగనుంది. ఈ దుర్ఘటనపై ఏవైనా విషయాలు తెలిసినవారు రైల్వే భద్రతా ప్రధాన కమిషనర్‌కు తెలపవచ్చని రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
పలు రైళ్లు రద్దు
కాంచన్‌జంగా రైలు ప్రమాదం నేపథ్యంలో మంగళవారం కూడా పలు రైళ్లు రద్దవ్వగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. కతిహార్-సిలిగుడి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, సిలిగుడి-కతిహార్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, న్యూజలపాయ్గుడి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్, జలపాయ్ గుడి శతాబ్ది ఎక్స్‌ప్రెస్, సిలిగుడి-జోగ్బాని ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ మంగళవారం రద్దయ్యాయని ఈశాన్య రైల్వే పేర్కొంది.