Jumbo Tulabharam In Karnataka : కర్ణాటకలో శిరహట్టి ఫకీరేశ్వర మఠం పీఠాధిపతి ఫకీర సిద్ధరామస్వామి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని అరుదైన జంబో తులాభార కార్యక్రమం నిర్వహించారు. మఠానికి సంబంధించిన ఏనుగుపై సిద్దరామస్వామిని కూర్చోబెట్టి 5,555 కిలోల రూ.10 నాణేలతో తులభారం వేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
సిద్ధరామస్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శిరహట్టి ఫకీరేశ్వర మఠం నిర్వాహకులు ఏడాదిపాటు భవైక్యతా రథయాత్ర నిర్వహించారు. అయితే తులభారానికి ముందు హుబ్బళ్లిలోని త్రిమురు సవీర మఠం నుంచి ఐదు ఏనుగులు, ఐదు ఒంటెలు సహా వివిధ బృందాలతో ఊరేగింపు జరిగింది. ఈ మహా శోభాయాత్రలో ఫకీర సిద్ధరామ స్వామిజీ, దింగాళేశ్వర స్వామీజీ, మూడువేల మఠాల స్వామీజీలు, వంద మందికి పైగా మఠాధిపతులు పాల్గొన్నారు.
పేద విద్యార్థుల చదువు కోసం!
అనంతరం తులాభార కార్యక్రమం జరిగింది. పేద విద్యార్థుల చదువు కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలోనే తొలిసారిగా స్వామిజీతో సహా ఏనుగు తులాభారం జరిగింది. ఈ తులాభారానికి రూ.22 లక్షలతో 40 అడుగుల పొడవు, 30 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు ఉన్న భారీ ఇనుప త్రాసును ఉపయోగించారు. రాయ్‌పుర్ ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఓ కంపెనీ ఈ భారీ త్రాసును తయారు చేసింది. దీని బరువు 25 టన్నులకు పైగా ఉంటుందని అంచనా.