తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అధికార మార్పిడి ఖాయమా? - JHARKHAND ASSEMBLY ELECTION 2024

శనివారం వెలువడనున్న ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు - గెలుపుపై ధీమాగా ఎన్​డీఏ Vs ఇండియా కూటమి

Jharkhand Assembly Election 2024
Jharkhand Assembly Election 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2024, 6:45 PM IST

Assembly Election 2024 :ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. ఎన్​డీఏ, ఇండియా కూటముల మధ్య నెలకొన్న ద్విముఖ పోరులో ఎవరిని విజయం వరిస్తుందో కొద్ది గంటల్లో తెలిపోనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు మొదలు పెట్టనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసింది.

ఎవరు గెలుస్తారు?
అధికార ఝార్ఖండ్‌ ముక్తి-మోర్చా-JMM, కాంగ్రెస్‌ కూటమి, ప్రతిపక్ష ఎన్డీఏ భవితవ్యం శనివారం తేలనుంది. ఈ ఫలితాల కోసం రెండు కూటముల నేతలు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. 2000 సంవత్సరం నవంబర్‌ 15న ఝార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల వరకు చూసుకుంటే, ఈసారే ప్రజలు అత్యధికంగా ఓట్లు వేశారు. రికార్డు స్థాయిలో 67.74 శాతం పోలింగ్‌ నమోదైంది. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి విడివిడిగా పరిశీలకులను నియమించింది. లెక్కింపు ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌కు ఒక ఏఆర్​ఓను నియమించినట్లు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మీడియా ప్రతినిధులు, అభ్యర్థులు లేదా వారి ఏజెంట్‌ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, తర్వాత ఈవీఎంలలో ఓట్లు లెక్కిస్తామని తెలిపారు. 9 గంటల తర్వాత నుంచి ఫలితాల సరళి వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

పోలింగ్ జరిగిందిలా!
ఝార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ జరిగింది. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగగా, మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో ఓటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధికార జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమి, ప్రతిపక్ష బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకోవాలని జేఎంఎం ఎన్నికల బరిలో నిలవగా, తిరిగి ఝార్ఖండ్‌ సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని ఈ ఎన్నికల్లో బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. ఈ నేపథ్యంలో తాజాగా వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీ కూటమికే అధికారం దక్కే అవకాశముందని అంచనా వేశాయి. జేఎంఎం నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ మాత్రం తాము అధికారం నిలబెట్టుకుంటామని ధీమాతో ఉంది.

ఆ స్థానాలపైనే అందరి దృష్టి!
ఈ ఎన్నికల్లో ప్రముఖ నాయకుల భవితవ్యాన్ని నిర్ణయించే కొన్ని స్థానాలపై అందరి దృష్టి నెలకొంది. ఈ ఫలితాల్లో మొత్తం 12,011 మంది అభ్యర్థుల భవిష్యత్తు తేలనుంది. సీఎం హేమంత్‌ సోరెన్‌ బర్‌హైట్‌ నియోజకవర్గం నుంచి బరిలో నిలవగా, ఆయన భార్య కల్పనా సోరెన్‌ గాండే స్థానం నుంచి పోటీ చేశారు. ఝార్ఖండ్‌ బీజేపీ నాయకుడు ప్రతిపక్షనేత అమర్‌ కుమార్ బౌరీ చందన్‌కియారీ నియోజకవర్గంలో బరిలో నిలిచారు. ధన్‌వార్‌ నుంచి బీజేపీ నేత బాబులాల్‌ మారాండి, నాలా నుంచి స్పీకర్‌ రబీంద్ర నాథ్‌, మహాగామా స్థానం నుంచి కాంగ్రెస్‌ నేత దీపిక పాండే సింగ్‌, జేఎంఎం నుంచి బీజేపీలోకి వెళ్లిన హెమంత్‌ సోరెన్‌ వదిన సీతా సోరెన్‌ జాంతారా స్థానం నుంచి పోటీకి దిగారు. సరాయ్‌కెలా నుంచి మాజీ సీఎం చంపయీ సోరెన్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details