Jammu And Kashmir Election Independent MLAs :జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సత్తాచాటిన నేషనల్ కాన్ఫరెన్స్ లో నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు చేరనున్నారు. గతంలో పొత్తులో భాగంగా టికెట్ దక్కక వీరందరూ సొంతంగా పోటీ చేసి తాజాగా జరిగిన ఎన్నికల్లో జయభేరి మోగించారు. ఈ క్రమంలో మళ్లీ సొంతగూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు, పీడీపీతో పొత్తుపై నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పీడీపీ కూడా ప్రభుత్వంలో భాగమవుతుందా? అనే చర్చ నడుస్తోంది.
మళ్లీ సొంతగూటికి!
రాజౌరీలోని తన్మండి నియోజకర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు ముజఫర్ ఇక్బాల్. ఆయన బీజేపీ అభ్యర్థి మహ్మద్ మాలిక్ పై 6179 ఓట్ల తేడాతో గెలుపొందారు. ముజఫర్ ఇక్బాల్ గతంలో నేషనల్ కాన్ఫరెన్స్ లో ఉన్న పొత్తులో భాగంగా సీటు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అలాగే ఇందర్వాల్లో లాల్ శర్మ, చౌదరి మహ్మద్ అక్రమ్, డాక్టర్ రామేశ్వర్ సింగ్ బానీ తదితరులు ఎన్సీ నాయకులైనప్పటికీ టికెట్ దక్కకపోవడం వల్ల ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు. ఈ నలుగురు ఇప్పుడు ఎన్సీలో చేరనున్నారు. దీంతో ఎన్సీ బలం 46కు చేరనుంది. మొత్తం జమ్ముకశ్మీర్లో ఏడుగురు స్వతంత్ర ఎమ్యెల్యేలు గెలువగా, అందులో నలుగురు ఎన్సీ చేరనుండడం గమనార్హం.
'నాయకత్వంతో టచ్ లో ఉన్నారు'
ఎన్నికలకు ముందు పార్టీని వీడి, ఇండిపెండింట్గా గెలిచిన ఎమ్మెల్యేలందరూ పార్టీ నాయకత్వంలో టచ్లో ఉన్నారని ఎన్సీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. వారందరూ నేషనల్ కాన్ఫరెన్స్లో చేరుతారని వెల్లడించారు. అలాగే స్వతంత్ర ఎమ్మెల్యేలు సైతం ఎన్సీలో చేరుతామని స్పష్టం చేశారు.
పొత్తుపై ఒమర్ వ్యాఖ్యలు
మరోవైపు, పీడీపీతో పొత్తుపై ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పీడీపీతో పొత్తుపై తాము ఎటువంటి చర్చలు జరపడం లేదని వెల్లడించారు. పీడీపీ కూడా తమను సంప్రదించలేదని పేర్కొన్నారు. "ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి కోలుకుని పీడీపీ చర్చలు జరుపుతుందనుకుంటున్నాం. అప్పుడు మేము పీడీపీతో చర్చలు జరుపుతాం. ప్రస్తుతానికి పీడీపీతో పొత్తు మా ప్రాధాన్యం కాదు. ప్రమాణ స్వీకారంపై ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. అలాంటి పనులు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయి. గురువారం శాసనసభా పక్ష సమావేశం నిర్వహిస్తాం. ఆ తర్వాత కూటమి శాసససభ పక్ష నాయకుడిని ఎన్నుకుంటుంది. ఆ తర్వాతే ప్రమాణ స్వీకారం తేదీ ఫిక్స్ అవుతుంది." అని ఒమర్ మీడియాతో వ్యాఖ్యానించారు.
'హరియాణాలో ఓటమి- కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి'
హరియాణాలో ఓటమికి కారణాలను తెలుసుకోవడానికి కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బుధవారం అన్నారు. ఎగ్జిట్ పోల్స్ తమ సమయాన్ని వృథా చేస్తున్నట్లు తాను ఎప్పుడో చెప్పానన్నారు. కానీ పూర్తిగా తారుమారు అవతాయని ఎవరూ అనుకోలేదని అన్నారు. జమ్ముకశ్మీర్లో కూటమిని నడపడం, సహాయం చేయడం తన పని, అది తాను చేస్తానన్నారు.