Jammu Kashmir Assembly : జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించే 370 అధికరణపై చేసిన తీర్మానం గురువారం ఉదయం గందరగోళ పరిస్థితులకు దారితీసింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో స్పీకర్ సభను కొద్ది సేపు వాయిదా వేశారు.
అసలేం జరిగిందంటే?
370 అధికరణను పునరుద్ధరించాలని కోరుతూ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం గురించి ప్రతిపక్ష నేత సునీల్ శర్మ అసెంబ్లీ మాట్లాడుతున్నారు. ఇంతలో ఇంజినీర్ రషీద్ సోదరుడు, అవామీ ఇత్తేహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370 పునరుద్ధరించాలంటూ బ్యానర్‌ను ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూకారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆ వెల్‌లోకి ప్రవేశించి బ్యానర్‌ను లాక్కునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య జరిగిన తోపులాటలో బ్యానర్ చిరిగిపోయింది. ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు దూసుకుపోయి దాడులు చేసుకున్నారు. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో స్పీకర్ అబ్దుల్ రహీం సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత బీజేపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. దీంతో సభ నుంచి బయటికి వెళ్లాలని స్పీకర్ వారికి సూచించారు. అందుకు నిరాకరించిన బీజేపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు లాక్కెళ్లారు. గట్టిగా తోసుకోవడం వల్ల కొందరు ఎమ్మెల్యేలు కిందపడిపోయారు.
మరోవైపు ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా స్పందించారు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు జాతి వ్యతిరేక శక్తులకు ఆశ్రయం ఇస్తున్నాయని ఆరోపించారు. "కాంగ్రెస్ పాక్‌తో చేయి కలిపింది. ఉగ్రవాదులతో చేయి కలిపింది" అంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఆర్టికల్ 370 పునరుద్ధరించాలని తీర్మానం
2019లో కేంద్రం తొలగించిన ఆర్టికల్ 370, 32(ఎ)ను పునరుద్ధరించాలని కోరుతూ పీడీపీ అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాకుండా తమకు ప్రత్యేక రాష్ట్ర హోదాను కూడా ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో బుధవారం కూడా జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలంటూ శాసనసభ తీర్మానం చేసింది. దీన్ని కూడా బీజేపీ సభ్యులు వ్యతిరేకించారు. అలా తీర్మానం కాపీలను చింపేశారు.