IRCTC Divya Dakshin yatra (Sravan Special): శ్రావణ మాసం హిందువులకు అత్యంత ప్రాముఖ్యత కలిగినది. వత్రాలు, పూజలు అంటూ చాలా మంది బిజీబిజీగా గడుపుతుంటారు. దేశంలోని ప్రముఖ దేవాలయాలు దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటుంటారు. మరి మీరు కూడా ఆ లిస్ట్‌లో ఉన్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. అతి తక్కువ ధరకే ప్రముఖ దేవాలయాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది. మరి, ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా శ్రావణ మాసం స్పెషల్‌గా ఐఆర్సీటీసీ "దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ" పేరుతో ఈ ప్యాకేజీ తీసుకొచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ రైలు ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్ మొదలు వరుసగా కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా జర్నీ ఉంటుంది. ఈ స్టేషన్లలో ట్రైన్ ఎక్కొచ్చు. ప్రయాణం అయిపోయాక పైన తెలిపిన స్టేషన్లలో దిగొచ్చు. ఇక ఈ టూర్ మొత్తం 8 రాత్రులు, 9 పగళ్లు సాగుతుంది. మరి ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరువణ్ణామలై రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ ప్రెషప్ అయ్యి.. అరుణాచలం ఆలయం దర్శించుకుంటారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్‌కు వచ్చి కుదాల్నగర్ స్టార్ట్ అవుతారు.
- మూడో రోజు ఉదయం కుదాల్నగర్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రామేశ్వరం చేరుకుంటారు. అక్కడ హోటల్లో చెకిన్ అవుతారు. తర్వాత ఫ్రెష్ అయ్యి స్థానికంగా ఉన్న దేవాలయాలను దర్శించుకుంటారు. సాయంత్రం తిరిగి హోటల్‌కు చేరుకుని ఆ రాత్రి అక్కడే భోజనం చేసి స్టే చేస్తారు.
- నాలుగోరోజు మధ్యాహ్నం భోజనం తర్వాత రామేశ్వరం నుంచి బస్సు ప్రయాణం ద్వారా మదురై స్టార్ట్ అవుతారు. సాయంత్రం మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత షాపింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అనంతరం కుదాల్నగర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కన్యాకుమారికి ట్రైన్ జర్నీ స్టార్ట్ అవుతుంది.
- ఐదో రోజు ఉదయం కొచ్చువేలి స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కన్యాకుమారి చేరుకుంటారు. హోటల్లో చెకిన్ అయ్యి ఫ్రెషప్ అనంతరం రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సూర్యాస్తమయం సందర్శిస్తారు. తిరిగి హోటల్‌కు చేరుకుని భోజనం ముగించి ఆ రాత్రికి కన్యాకుమారిలో స్టే చేస్తారు.
సౌత్ ఇండియాలోని ఈ ఆలయాలు చూసొస్తారా? - వైజాగ్ నుంచి IRCTC సూపర్ ప్యాకేజీ! ధర కూడా అందుబాటులోనే!
- ఆరో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి రోడ్డు మార్గం ద్వారా త్రివేండ్రం స్టార్ట్ అవుతారు. అక్కడికి చేరుకున్న తర్వాత పద్మనాభ స్వామి ఆలయం దర్శించుకుంటారు. ఆ తర్వాత కొద్దిసేపు కోవలం బీచ్‌లో ఎంజాయ్ చేస్తారు. అక్కడి నుంచి కొచ్చువేలి స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి తిరుచిరాపల్లి బయలుదేరుతారు.
- ఏడో రోజు ఉదయం తిరుచిరాపల్లి చేరుకుని హోటల్లో ఫ్రెషప్ అనంతరం శ్రీరంగం టెంపుల్ దర్శించుకుంటారు. మధ్యాహ్నం భోజనం తర్వాత తంజావూర్ స్టార్ట్ అవుతారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని దర్శించుకుని.. అక్కడి నుంచి తంజావూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు స్టార్ట్ అవుతారు.
- 8వ రోజు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట మీదుగా 9వ రోజు ఉదయం 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో దివ్య దర్శన యాత్ర పూర్తవుతుంది.