IRCTC Leh With Turtuk Package: ప్రకృతి అందాలను వీక్షిస్తూ టైం స్పెండ్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందులోనూ చుట్టూ ఎత్తైన మంచు పర్వతాలు.. అందమైన సరస్సులు కొలువుదీరిన ప్రాంతాలను సందర్శించాలని చాలా మందికి ఉంటుంది. అందుకే కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ఉన్న ఈ అద్భుతమైన ప్రాంతాలను వీక్షించే అవకాశం కల్పిస్తోంది.. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). ప్రయాణంతో పాటు అన్ని వసతులతో ఉండే విధంగా లేహ్ విత్ టర్టుక్(Leh With Turtuk) పేరిట ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం ఆరు రాత్రులు, ఏడు పగళ్లు కొనసాగుతుంది. లేహ్ ప్యాలెస్, మ్యాగ్నెటిక్ హిల్స్, నుబ్రా వ్యాలీ, పాంగాంగ్ సరస్సును ఈ టూర్‌లో భాగంగా సందర్శించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ జూన్ 25న, జులై 17న, ఆగస్టు 1న ఉంది.
ప్రయాణం ఇలా..
- ఉదయం 4 గంటలకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 6 గంటలకు విమానం (6E-2379/2049) బయల్దేరుతుంది. ఉదయం 10:50కి లేహ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ ముందుగా బుక్ చేసిన హోటల్‌లో చెకిన్ అవ్వాలి. ఆరోజు ఎటువంటి ప్రదేశాల సందర్శన ఉండదు. ఎందుకంటే అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు ఆ రాత్రికి టైం ఇస్తారు. సో.. రాత్రి లేహ్‌లోని హోటల్‌లోనే బస ఉంటుంది.
- రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లేహ్-శ్రీనగర్ ప్రధాన రహదారి చుట్టూ ఉన్న ప్రాంతాలను వీక్షించవచ్చు. ఆ తర్వాత ‘హాల్ ఆఫ్ ఫేమ్’ మ్యూజియం సందర్శన ఉంటుంది. వీటితో పాటు జోరావర్ ఫోర్ట్, గురుద్వారా పత్తర్ సాహిబ్, శాంతి స్థూపం, లేహ్ ప్యాలెస్‌ను సందర్శించవచ్చు. గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఉండే మ్యాగ్నెటిక్ హిల్ అనుభూతిని పొందొచ్చు. పవిత్రమైన సింధు మైదానాన్ని, జంస్కార్ సంగమాన్ని చూసి ఆల్చి మీదుగా మళ్లీ లేహ్ చేరుకుంటారు. రాత్రికి అక్కడే స్టే చేయాలి.
- మూడో రోజు ఉదయం టిఫెన్ తిన్న తర్వాత ఖర్దుంగ్లా పాస్ ద్వారా ప్రయాణించి నుబ్రా వ్యాలీ చేరుకుంటారు. ఈ ప్రయాణంలో అందమైన పర్వత శ్రేణుల అందాలను చూడొచ్చు. ఇక మధ్యాహ్నం భోజనం ముగించుకొని అక్కడున్న ప్రజల జీవన శైలిని తెలుసుకొనేందుకు దీక్షిత్, హుందర్ గ్రామాలకు, మఠాలకు తీసుకువెళ్తారు. అక్కడే ఒంటె సఫారీ ఉంటుంది(ఈ సఫారీ డబ్బులు యాత్రికులే చెల్లించాలి). ఆ రోజు రాత్రి నుబ్రాలోనే బస ఉంటుంది.
- నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత టర్టుక్‌కు పయనమవుతారు. మార్గ మధ్యలో సియాచిన్ వార్ మెమోరియల్, థాంగ్ జీరో పాయింట్ సందర్శిస్తారు. టర్టుక్లోనే మధ్యాహ్నం భోజనం ఉంటుంది. ఆ తర్వాత టర్టుక్ లోయ అందాలను వీక్షిస్తారు. తర్వాత బాల్టీ హెరిటేజ్ హౌస్, మ్యూజియం, నేచురల్ కోల్డ్ స్టోరేజ్‌ను సందర్శించి నుబ్రాకు తిరుగు ప్రయాణమవుతారు. ఆ రాత్రి నుబ్రా వ్యాలీలో ఏర్పాటు చేసిన హోటల్లో స్టే ఉంటుంది.
- ఐదో రోజు ఉదయం టిఫిన్ ముగించుకొని పాంగాంగ్‌కు బయల్దేరుతారు. భారత్, చైనా మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండే పాంగాంగ్ సాల్ట్ వాటర్ లేక్ అందాలను వీక్షించొచ్చు. రాత్రి పాంగాంగ్‌లోనే బస ఉంటుంది.
- ఆరో రోజు ఉదయం అందమైన సూర్యోదయాన్ని చూసి అల్పాహారం ముగించుకొని లేహ్‌కు బయల్దేరుతారు. మార్గంలో థిక్సే మొనాస్టరీ, షే ప్యాలెస్, రాంచో స్కూల్‌లను సందర్శించి లేహ్ చేరుకుంటారు. ప్రయాణికుల అభిరుచి మేరకు సొంత ఖర్చులతో లేహ్ చుట్టూ ఉన్న ప్రాంతాలను సందర్శించవచ్చు. రాత్రి హోటల్‌లో బస చేయాల్సి ఉంటుంది.
- ఏడో రోజు ఉదయం టిఫిన్ చేసి లేహ్ ఎయిర్‌పోర్ట్ చేరుకొని విమానంలో (6E-2007/6282) హైదరాబాద్ పయనమవుతారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోవటంతో మీ ప్రయాణం ముగుస్తుంది.