IRCTC Punya Kshetra Yatra Tour Package:ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC).. "పుణ్యక్షేత్ర యాత్ర" పేరుతో ఓ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో కాశీ, గయ, పూరీ, అయోధ్య వంటి ప్రముఖ క్షేత్రాలను దర్శించుకోవటానికి వీలు కల్పిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ స్టేషన్ల గుండా ఈ రైలు ప్రయాణం సాగుతుంది. సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో యాత్రికులు ఈ రైలు ఎక్కొచ్చు. 9 రాత్రులు, 10 పగళ్లు కొనసాగే ఈ యాత్రా విశేషాలు ఇప్పుడు చూద్దాం.
ప్రయాణం ఇలా..
- మెదటి రోజున సికింద్రాబాద్ నుంచి పుణ్యక్షేత్ర యాత్ర ప్రారంభమవుతుంది.
- కాజీపేట, ఖమ్మం, విజయాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట గుండా రైలు ప్రయాణిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉండే వారు అక్కడే రైలు ఎక్కొచ్చు.
- రెండో రోజు పెందుర్తి, విజయనగరం మీదుగా ప్రయాణించి మాల్తీపాట్పూర్‌కు ఉదయం 9 గంటలకు చేరుతుంది. రైల్వే స్టేషన్ నుంచి పూరీ వెళ్లాలి.
- ముందుగానే బుక్ చేసిన హోటల్‌లో బస ఉంటుంది. లంచ్ తర్వాత జగన్నాథుని దర్శించుకోవాలి. ఆ రాత్రి పూరీలోనే బస ఉంటుంది.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రపంచ ప్రసిద్ధికెక్కిన కోణార్క్‌లోని సూర్యదేవాలయాన్ని సందర్శించుకోవాలి. తర్వాత మాల్తీపాట్పూర్ రైల్వేస్టేషన్ నుంచి గయకు ప్రయాణం స్టార్ట్ అవుతుంది.
- నాలుగోరోజు ఉదయం 8:30 గంటలకు గయ చేరుకుంటారు. ఉదయం హోటల్‌లోనే అల్పాహారం తీసుకున్నాక విష్ణుపాద దేవాలయాన్ని చూశాక వారణాసికి ప్రయాణమవుతారు.
- ఐదో రోజు ఉదయం 6 గంటలకు వారణాసి చేరుకుంటారు. అక్కడే హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ ముగించుకొని కాశీనాథుని పుణ్యక్షేత్రం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవీ ఆలయాల దర్శనం ఉంటుంది. సాయంత్రం గంగా హారతిని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆ రోజు రాత్రి వారణాసిలో బస ఉంటుంది.
- ఆరో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి వారణాసిలోని ప్రముఖ దేవాలయాలు, ఘాట్లు దర్శించవచ్చు. రాత్రి భోజనం తర్వాత ఆ రోజు కూడా వారణాసిలో స్టే చేయాలి.
- శ్రీరాముని జన్మస్థానమైన అయోధ్యకు ఏడో రోజు చేరుకుంటారు. ఆ రోజు శ్రీరాముడు, హనుమంతుని ఆలయాలు దర్శించుకుంటారు. సాయంత్రం సరయూ హారతిని వీక్షించి రాత్రి భోజనం తర్వాత ప్రయాగ్‌రాజ్‌కు స్టార్ట్ అవుతారు.
- ఎనిమిదో రోజు ఉదయం ప్రయాగ్‌రాజ్ చేరుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ అనంతరం అక్కడ హనుమాన్ ఆలయం, శంకర్ విమన్ మండపాన్ని సందర్శిస్తారు. త్రివేణి సంగమాన్ని చూసి తిరుగు ప్రయాణమవుతారు.
- తొమ్మిదో రోజు విజయనగరం, పెందుర్తి, సామర్లకోటకు యాత్రా రైలు చేరుకుంటుంది.
- పదో రోజు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజీపేట ప్రాంతాల మీదుగా ప్రయాణించి సికింద్రాబాద్ చేరుకోవటంతో యాత్ర పూర్తవుతుంది.