Indians In Russia Ukraine War CBI:అక్రమ మార్గాల్లో రష్యాకు భారత యువకులను తరలించి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనాలని వేధిస్తున్న ముఠా గుట్టును సీబీఐ రట్టు చేసింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని వీసా కన్సెల్టెన్సీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ, పలువురిని అదుపులోకి తీసుకుంది. వీరంతా యువకులకు మాయమాటలు చెప్పి అధిక వేతనం ఆశజూపి, రష్యాకు పంపించి అక్కడ వారి పాస్‌పోర్ట్‌లు స్వాధీనం చేసుకుని బలవంతంగా యుద్ధంలో పాల్గొనేలా చేస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. ఉక్రెయిన్ యుద్ధంలోకి భారత యువకులను బలవంతంగా నెట్టేస్తున్న నెట్‌వర్క్‌తో ప్రమేయం ఉన్న రష్యాకు చెందిన ఇద్దరు ఏజెంట్లు తమ నిఘా పరిధిలో ఉన్నట్లు సీబీఐ ప్రకటించింది. ఈ ఏజెంట్లు రష్యాకు వచ్చిన భారతీయుల పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకుని, ఉక్రెయిన్ సాయుధ దళాలతో పోరాడాలని భారత యువకులను బలవంతం చేస్తున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
భారీ జీతం ఆశచూపి యుద్ధంలోకి
రాజస్థాన్‌కు చెందిన క్రిస్టినా, మొయినుద్దీన్ చిప్పా రష్యాలో నివసిస్తున్నారని, వీరిద్దరూ భారీ జీతంతో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆశజూపి భారతీయ యువకులను రష్యా పంపుతున్నారని అధికారులు తెలిపారు. ఇలా భారత యువకులను రష్యాకు పంపుతున్న ఈ కేసులో 17 వీసా కన్సల్టెన్సీ కంపెనీలు, వాటి యజమానులు, భారత్‌లో విస్తరించిన ఉన్న వారి ఏజెంట్లపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదు చేసింది.
సోషల్ మీడియాలో సంప్రదించి ఎర
రష్యాలో సెక్యూరిటీ గార్డులు, ఆర్మీలో సహాయకులుగా ఉద్యోగాలు కల్పిస్తామని, మెరుగైన జీవితం, భారీ జీతం అందిస్తామని భారత యువకులను కొందరు ఏజెంట్లు రష్యాకు తరలిస్తున్నారని సీబీఐ గుర్తించింది. ఏజెంట్ల ద్వారా భారతీయులను రష్యాకు తరలించారని, దీనికోసం భారీ మొత్తంలో వసూలు చేశారని సీబీఐ వెల్లడించింది. రష్యా చేరుకున్న తర్వాత భారత యువకులకు యుద్ధంలో స్వల్పకాలిక శిక్షణ ఇస్తారని, తర్వాత రష్యన్ ఆర్మీ యూనిఫాంలు, బ్యాచ్‌లు అందించి ఉక్రెయిన్ యుద్ధంలో ముందు వరుసలో ఉంచుతున్నారని సీబీఐ తెలిపింది. భారత యువకులు వారి ఇష్టానికి వ్యతిరేకంగా రష్యా-ఉక్రెయిన్ వార్ జోన్‌లో ముందు వరుసలో ఉంటున్నారని, ఇది వారి ప్రాణాలకు తీవ్ర ముప్పును ఏర్పరుస్తోందని CBI తన FIRలో పేర్కొంది. సోషల్ మీడియా, స్థానిక పరిచయాల ద్వారా యువకులను ఏజెంట్లు సంప్రదిస్తున్నట్లు కూడా వివరించింది.