India Pakistan Relations :భారత్‌ను దెబ్బతీయడానికి పాకిస్థాన్ అన్ని విధాలా ప్రయత్నిస్తోందని రిటైర్డ్ మేజర్ జనరల్ జీడీ బక్షి తెలిపారు. దేశంలో సమస్యలను సృష్టించేందుకు పాక్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ గురించి బక్షి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో దాయాది దేశంపై విరుచుకుపడ్డారు.
ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాక్!
"పాకిస్థాన్ కొన్నేళ్ల క్రితం నుంచే పిర్ పంజాల్‌కు దక్షిణాన ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. అలాగే బంగ్లాదేశ్‌లోనూ విద్వేషాలు సృష్టిస్తోంది. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ఇంటిపై ఆందోళనకారులు దాడులు చేయడం వల్ల ఆమె ఆశ్రయం కోసం దిల్లీకి పారిపోవాల్సి వచ్చింది. అయితే వాస్తవం ఏంటంటే పాకిస్థాన్ 1971లో దేశాన్ని రెండు ముక్కలు చేయాలనుకుంది. ఆయుధ బలంతో బంగ్లాదేశ్‌ను ఏలాలనుకుంది. అయితే 1971లో బంగ్లా ఏర్పాటుకు భారత్ సహకరించడం వల్ల దేశంపై పాకిస్థాన్ కోపం పెంచుకుంది" అని బక్షి వ్యాఖ్యానించారు.
రిటైర్డ్ మేజర్ జనరల్ జీడీ బక్షితో ఈటీవీ భారత్ ఇంటర్వ్యూ (ETV Bharat) 'భారత్‌తో పాక్ శాంతిని కోరుకోదు'
పాకిస్థాన్ మిలటరీ ఐఎస్‌ఐ కాంప్లెక్స్ భారత్‌తో ఎప్పటికీ శాంతిని కోరుకోదని బక్షి తెలిపారు. భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అలాగే దేశంలో గందరగోళ పరిస్థితులు సృష్టించడానికి కుట్రలు పన్నుతుందని విమర్శించారు. ఇరుదేశాల మధ్య సయోధ్యకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. "బంగ్లాదేశ్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు దక్షిణాసియాలో భూకంపం లాంటివి. వాస్తవం ఏమిటంటే 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటుకు భారత్ సహకరించింది. దీంతో దక్షిణాసియాలో భౌగోళిక, రాజకీయ పరిస్థితులను నిర్మించాం. ఆ తర్వాత దక్షిణాసియాలో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది. అందుకే భారత్‌ను ఇబ్బందులకు గురిచేయడానికి, తీవ్రతమైన భద్రతా సవాళ్లను సృష్టించడానికి పాకిస్థాన్, అమెరికా చేతులు కలిపాయి. గతేడాది పాకిస్థాన్ జనరల్ ఆసిఫ్ మునీర్ అమెరికాలో సందర్శించారు. అక్కడ అమెరికా దౌత్యవేత్త విక్టోరియా న్యూలాండ్ను కలిశారు. ఈ సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు అనుమానాలు ఉన్నాయి" అని బక్షి తెలిపారు.
ఈ ఏడాది అక్టోబరులో ఇస్లామాబాద్ వేదికగా జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) ప్రభుత్వాధినేతల సదస్సుకు రావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆహ్వానించారు. అయితే భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రధాని పాక్‌లో పర్యటించే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి. అయితే గతేడాది భారత్‌లో జరిగిన ఎస్సీఓ విదేశాంగ మంత్రుల సమావేశానికి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో హాజరయ్యారు.