India Election Expenditure : నిష్పాక్షిక, పారదర్శక, ప్రలోభాలకు తావులేని ఎన్నికలే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువులు. అలాంటి స్ఫూర్తికి అంగబలం, ధనబలం రూపంలో అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ధనప్రభావం ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోంది. దీన్ని కట్టడి చేయడానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) వద్ద ఉన్న అస్త్రమే అభ్యర్థుల వ్యయ నియంత్రణ. ఎన్ని చర్యలు చేపడుతున్నా, పార్టీలు పట్టపగ్గాల్లేకుండా ఎన్నికల్లో డబ్బులను ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా ఎన్నికలు నానాటికీ వ్యయభరిత మవుతున్నాయి.
ఏమిటి వ్యయ పరిమితి?
ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా అభ్యర్థులందరికీ సమానావకాశాలు కల్పించడానికే ఎన్నికల ప్రచార ఖర్చుపై ఈసీ నియంత్రణ పెట్టింది. ఒక అభ్యర్థి తన ఎన్నికల ప్రచారం కోసం చట్టబద్ధంగా వెచ్చించదగిన మొత్తాన్ని వ్యయపరిమితిగా పేర్కొంటారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 77(1) ప్రకారం, అభ్యర్థుల తమ ప్రచార ఖర్చుకు సంబంధించిన లెక్కలను పక్కాగా నిర్వహించాలి. నామినేషన్ వేసిన తేదీ నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు వీటిని కొనసాగించాల్సి ఉంటుంది. అందులో బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాలకు సంబంధించిన వ్యయాన్ని నమోదు చేయాలి. అభ్యర్థులంతా తమ వ్యయ ప్రకటనలను ఎన్నికలు ముగిశాక ఈసీకి సమర్పించాలి. అయితే, ఈ పరిమితి కేవలం అభ్యర్థుల ప్రచార ఖర్చులపై మాత్రమే ఉంది. ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు వెచ్చించే మొత్తాలపై ఎలాంటి ఆంక్షలు లేవు.
ప్రాతిపదిక ఏమిటి?
భారత ఎన్నికల సంఘం తరచూ ఈ వ్యయపరిమితిని సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ఖర్చు, ఓటర్ల సంఖ్య ఆధారంగా ఈ పరిమితిలో మార్పులు చేస్తుంది. ద్రవ్యోల్బణం కారణంగా ఏటా సరకులు, వస్తువుల ధరల్లో పెరుగుదలను అంచనావేయడానికి ధరల ద్రవ్యోల్బణ సూచీ (సీఎఫ్‌ఐ)ని ప్రామాణికంగా తీసుకుంటారు. 2014-15లో అది 240గా ఉండగా, 2021-22కు 317కు పెరిగింది. ఆ మేరకు 2022లో చివరిసారిగా అభ్యర్థుల వ్యయపరిమితిని ఈసీ సవరించింది.
పెరిగింది ఇలా
స్వతంత్ర భారత తొలి సార్వత్రిక ఎన్నికలు 1951-52లో జరిగినప్పుడు లోక్‌సభ అభ్యర్థి వ్యయ పరిమితి రూ.25వేలుగా ఉంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో దాన్ని రూ.10వేలుగా నిర్ణయించారు. 1971లో ప్రధాన రాష్ట్రాల్లో దాన్ని రూ.35వేలుగా ఈసీ నిర్ధరించింది. దానిని 1980లో రూ.లక్షకు పెంచింది. 1984లో దాన్ని పెద్ద రాష్ట్రాల్లో రూ.1.5లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.1.3 లక్షలుగా సవరించింది. 1-2 లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రాలకు రూ.లక్షగా, చండీగఢ్ వంటి కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.50వేలుగా నిర్ణయించింది ఎన్నికల సంఘం. 1996లో వ్యయ పరిమితిని పెద్ద రాష్ట్రాల్లో రూ.4.5లక్షలకు పెంచారు. 1998లో దాన్ని ఏకంగా రూ.15లక్షలకు నిర్ణయించారు. 2004కు వచ్చే సరికి రూ.25లక్షలకు చేరింది. పదేళ్లపాటు ఈ పరిమితిలో ఎలాంటి సవరణలు చేయలేదు. 2014లో అది రూ.70లక్షలకు పెరిగింది. 2022లో మరోసారి ఈసీ ఈ పరిమితిలో సవరణ చేసింది.