India Alliance AAP :దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిని గద్దె దింపేందుకు ఏర్పడ్డ విపక్షాల ఇండియా కూటమికి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగుతామని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించగా, తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ మరో షాక్ ఇచ్చింది. పంజాబ్, చండీగఢ్‌లోని కూటమితో తమకు ఎలాంటి పొత్తు ఉండదని ప్రకటించింది.
పంజాబ్, చండీగఢ్‌లోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలకు తాము పార్టీ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు ఆప్ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. వచ్చే 10-15 రోజుల్లో మొత్తం 14 స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. పంజాబ్‌లోని అమ్లోహ్‌లో ఘర్ ఘర్ రేషన్ పథకాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. మొత్తం 14 స్థానాల్లో అఖండ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
"మరోసారి మీ ఆశీస్సులు కోరుతున్నాను. మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్‌లో 13 సీట్లు, చండీగఢ్‌లో ఒకటి. మొత్తంగా 14 సీట్లు ఉన్నాయి. వచ్చే 10-15 రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తుంది. మీరు రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాకు మద్దతిచ్చినట్లే, సార్వత్రిక పోరులో 14 స్థానాల్లో ఆప్‌ను గెలిపించండి. తమ పార్టీ గుర్తు చీపురుకు ఓటు వేయండి" అని కేజ్రీవాల్ ప్రజలను కోరారు.