తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాబాయి Vs అబ్బాయి - మహారాష్ట్ర ఎన్నికల్లో మళ్లీ ప'వార్​'- ఈసారి గెలుపు ఎవరిదో? - MAHARASHTRA ELECTIONS 2024

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పోరు - బారామతిలో అజిత్ పవార్ వర్సెస్ యుగేంద్ర - 35 స్థానాల్లో ఎన్​సీపీకి చెందిన రెండు వర్గాల మధ్యే పరస్పర పోటీ

Maharashtra Assembly Election 2024
Maharashtra Assembly Election 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2024, 3:58 PM IST

Maharashtra Election 2024 Baramati :మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎన్నడూ లేనంతగా ఈసారి ఉత్కంఠ రేపుతున్నాయి. శివసేన, ఎన్​సీపీ వంటి ప్రధాన పార్టీలు అంతర్గత కలహాలతో రెండుగా చీలిపోవడం అందుకు ప్రధాన కారణం. మరీ ముఖ్యంగా ఎన్​సీపీ చీలిపోయిన తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు కావడం వల్ల అందరిలో ఆసక్తి నెలకొంది. పవార్‌ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతిసహా 35స్థానాల్లో బాబాయి, అబ్బాయి వర్గాలు తలపడుతున్నాయి.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బాబాయి, అబ్బాయిల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. రాజకీయ కురువృద్ధుడు, బాబాయి శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్​సీపీలో చీలిక తెచ్చిన అబ్బాయి అజిత్‌ పవార్‌ శిందే సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వంతో జతకట్టారు. ఎన్​సీపీ వ్యవస్థాపకుడు శరద్‌ పవార్‌ ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ (MVA) కూటమితో కలిసి ఎన్నికల బరిలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్​సీపీ రెండువర్గాలు తొలిసారి పరస్పరం తలపడుతుండటం ఉత్కంఠ రేపుతోంది.

కంచుకోటలో గట్టి పోటీ
పవార్‌ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి నియోజకవర్గం ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి శరద్‌ పవార్‌, ఆ తర్వాత అజిత్‌ పవార్‌ దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1967లో తొలిసారి బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన శరద్‌ పవార్‌ 1990 వరకు ప్రాతినిధ్యం వహించారు. 1991 ఉప ఎన్నిక నుంచి 2019 వరకు అజిత్‌ పవార్‌ గెలిచారు. దాదాపు 6 దశాబ్దాల నుంచి పవార్‌ కుటుంబం కంచుకోటగా ఉన్న బారామతి స్థానంలో ఈసారి ఇరువర్గాలు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్‌ పవార్‌ మరోసారి బరిలో నిలిచారు. వరుసగా ఏడుసార్లు గెలిచిన అజిత్‌ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎన్​సీపీ(ఎస్​పీ) తరఫున యుగేంద్ర పవార్‌ బరిలో నిలిచారు. అజిత్‌ పవార్‌ సోదరుడు శ్రీనివాస్‌ కుమారుడు యుగేంద్ర. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి పవార్‌ కుటుంబం మధ్య పోరు జరిగింది. బారామతి లోక్‌సభ స్థానంలో అజిత్‌ భార్య సునేత్ర పవార్‌ ఓడిపోయారు. ఎన్​సీపీ(ఎస్​పీ) తరఫున పోటీ చేసిన శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే గెలుపొందారు. సునేత్రపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో సుప్రియా విజయం సాధించారు.

35 స్థానాల్లో హోరాహోరీ
బారామతి సహా మెుత్తం 35 నియోజకవర్గాల్లో ఎన్​సీపీకి చెందిన ఇరువర్గాలు తలపడుతున్నాయి. విదర్భలోని తుమ్సర్, అహేరి, పుసాద్, ముంబయి, పుణె, కొల్హాపూర్ తదితర స్థానాల్లో నేరుగా తలపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ ఇరువర్గాల వ్యూహాలు భిన్నంగా ఉన్నాయి. ఎన్​సీపీ సంప్రదాయ విలువలపై శరద్‌ పవార్‌ వర్గం దృష్టి సారించింది. సామాజిక సంక్షేమం, అభివృద్ధి తదితర వాగ్దానాలతో గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అజిత్‌ పవార్‌ వర్గం మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ ప్రాజెక్టులకు ప్రచారంలో ప్రాధాన్యం ఇస్తోంది. అర్బన్, సెమీ అర్బన్ ఓటర్లపై అజిత్‌ వర్గం దృష్టి కేంద్రీకరించింది.

లోక్​సభ ఫలితాలే రిపీట్ అవుతాయా?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎన్​సీపీలోని రెండు వర్గాల భవితను తేల్చనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అజిత్‌ తిరుగుబాటు కారణంగా శరద్‌ పవార్‌ వర్గంపై సానుభూతి పెరిగినట్లు భావిస్తున్నారు. ఈ విషయం లోక్‌సభ ఎన్నికల్లో స్పష్టమైందని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పది స్థానాల్లో పోటీ చేసిన శరద్‌ పవార్‌ వర్గం 8 చోట్ల విజయం సాధించింది. నాలుగు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన అజిత్‌ పవార్‌ వర్గం కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పలువురు సీనియర్లు తిరిగి శరద్‌ పవార్‌ గూటికి చేరటం ఆ వర్గానికి అనుకూలాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్‌సభ తరహా ఫలితాలు వస్తాయా లేక భిన్నంగా ఉంటాయా అన్నది త్వరలో తేలనుంది.

ABOUT THE AUTHOR

...view details